లారెన్స్ సినిమా రచ్చ రచ్చవుతోంది

గత ఏడాది కాంఛన-3 (గంగ) సినిమాతో పెను సంచలనానికి తెర తీశాడు రాఘవ లారెన్స్. ఆ చిత్రం కేవలం తమిళం వరకే వంద కోట్ల కలెక్షన్లు సాధించి ఆశ్చర్యపరిచింది. ఆ సినిమాలో ‘మొట్ట శివ కెట్ట శివ’ అంటూ లారెన్స్‌కు ఒక మేనరిజం డైలాగ్ ఉంటుంది. అది తమిళంలో భలేగా పాపులర్ అయింది. ఆ మాటనే టైటిల్‌గా పెట్టి ఓ సినిమాను అనౌన్స్ చేశాడు లారెన్స్. ఐతే తర్వాత లారెన్స్ ఆలోచన మారిపోయింది. తాను కథానాయకుడిగా నటిస్తున్న ‘పటాస్’ రీమేక్ కోసం ఈ టైటిల్ తీసేసుకున్నాడు. ముందు ఆ టైటిల్ పెట్టిన సినిమాకు మరో టైటిల్ పెట్టుకుందామని అనుకున్నాడు. ఆ సినిమా ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంది.

ఐతే ఇప్పుడు లారెన్స్ తో ఆ సినిమాను నిర్మించాల్సిన నిర్మాత అడ్డం తిరిగాడు. ‘మొట్ట శివ కెట్ట శివ’ అనే టైటిల్ తమ సినిమా కోసం రిజిస్టర్ చేయించిందని చెబుతూ ఈ పేరుతో వస్తున్న కొత్త సినిమాను అడ్డుకోవడానికి చూశాడు. దీనిపై వివాదం పెద్దదై ‘పటాస్’ రీమేక్ నిర్మాత ఆర్.బి.చౌదరి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లే వరకూ వచ్చింది. తమ సినిమాకు కావాలనే అడ్డం పడుతున్నారని.. చెబుతూ సదరు నిర్మాతపై ఫిర్యాదు చేశాడు ఆర్.బి.చౌదరి. తమ సినిమా విడుదల కాకుండా కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.

‘పటాస్’ రీమేక్ ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ ఈ వివాదం వల్లే ఆగిపోయింది. దీని కంటే ముందు జనవరి 26న పి.వాసు దర్శకత్వంలో లారెన్స్ నటించిన రీమేక్ మూవీ ‘శివలింగ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.