సినిమా సినిమాకు రేంజ్ మారుతోంది

బాహుబలి సౌత్ సినిమాను వేల కోట్ల రేంజ్ కు తీసుకెళ్లి ఉండొచ్చు. కానీ… దానికి మొద‌టి అడుగు ప‌డింది మాత్రం ర‌జ‌నీ న‌టించిన రోబో సినిమాతోనే. ఆ సినిమాతో సౌత్ ఇండ‌స్ట్రీ ద‌శ దిశ మారాయి. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు టాలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉంది. మ‌న స్టార్ హీరోల‌కు దీటుగా ర‌జ‌నీ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. కానీ, గ‌తంలో  ర‌జ‌నీ సినిమాల‌ను తెలుగులో డ‌బ్ చేసేందుకు నిర్మాత‌లు అనాస‌క్తి చూపేవారు కాద‌ట‌.

ర‌జ‌నీ కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ‘బాషా ను తెలుగులో డబ్ చేసేందుకు బ‌డా నిర్మాత‌లెవ‌రూ ముందుకు రాలేదు. అప్ప‌ట్లో కొంత‌మంది డిస్ట్రిబ్యూట‌ర్లు బాషా సినిమా తెలుగు కాపీ రైట్స్‌ను రూ.20 ల‌క్ష‌ల‌కు కొన్నార‌ట‌. యాంగ్రీ యంగ్ మెన్‌గా, మాఫియా డాన్‌గా ర‌జ‌నీ న‌ట‌న తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత మెప్పించిందో తెలిసిందే. దీంతో దానిని కొన్న వాళ్ల పంట పండింది. 1995లో విడుద‌లైన ఆ చిత్రం రికార్డు క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసి తెలుగులో ర‌జ‌నీ కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. బాషా త‌ర్వాత ర‌జ‌నీకాంత్ వెనుదిరిగి చూసుకొనే అవ‌స‌రం రాలేదు.

నిజానికి క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య్‌కాంత్ వంటి హీరోల సినిమాలు 1980ల నుంచే తెలుగులో విడుద‌ల‌య్యేవి. వారి హ‌వా వ‌ల్ల ర‌జ‌నీ టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కాలం ప‌ట్టింది. బాషా త‌ర్వాత టాలీవుడ్‌లో ర‌జ‌నీ మార్కెట్ క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చింది. బాషా త‌ర్వాత‌ తెలుగులో విడులైన ముత్తు(80 ల‌క్ష‌లు), న‌ర‌సింహ‌(1.2 కోట్లు), చంద్ర‌ముఖి(4 కోట్లు) శివాజీ(13 కోట్లు) కు పంపిణీ దారులు హ‌క్కులు కొనుక్కోగా రోబో సినిమాను ఏకంగా 22 కోట్లకు కొన్నారు.  ఆ చిత్రాలు కొన్న ధ‌ర కంటే అధిక వ‌సూళ్లు సాధించి నిర్మాత‌ల‌కు కాసుల పంట పండించాయి.

ఇటీవ‌ల విడుద‌లైన క‌బాలి చిత్రం అత్య‌ధిక ఓపెనింగ్ క‌లెక్ష‌న్ల‌తో సంచ‌ల‌నం సృష్టించినా పెద్ద‌ విజ‌యాన్ని న‌మోదు చేయ‌లేదు. కానీ రోబో 1 సీక్వెల్ సేమ్ కాంబినేష‌న్లో వ‌స్తున్న రోబో 2.0 చిత్రానికి విప‌రీత‌మైన హైప్ ఉంది. బాహుబ‌లి త‌ర్వాత రేట్లు కూడా పెరిగిన నేప‌థ్యంలో రోబో 2.0కు  40-50 కోట్లు చెల్లించేందుకు నిర్మాత‌లు రెడీగా ఉన్నారు. 6 ఏళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల ముస‌లాడి దాకా ర‌జ‌నీ అభిమానులే. శంక‌ర్ మార్కు, పైగా సూప‌ర్ హిట్ సినిమా సీక్వెల్ కావ‌డంతో మ‌రో చ‌రిత్ర సృష్టించే అవ‌కాశాలు లేక‌పోలేదు.