ఆ డైరెక్టర్ కోసం స్టార్ హీరోలు రెడీనా?

కెరీర్ ఆరంభంలో రవితేజ.. వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు గోపీచంద్ మలినేని. ఆ తర్వాత రామ్.. సాయిధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో సర్దుకుపోవాల్సి వచ్చింది. ఐతే తేజుతో గోపీచంద్ చేసిన ‘విన్నర్’ సినిమా తర్వాత తన ఫేట్ మారిపోతుందని ఆశించాడు. ఈ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ‘విన్నర్’ తర్వాత తనతో పని చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తారని.. వాళ్ల నుంచి తనకు పిలుపు వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు గోపీచంద్. ‘విన్నర్’ సినిమా విడుదలైంది. మరి ఇప్పుడు గోపీచంద్‌తో పని చేయడానికి ఏ స్టార్ హీరో ముందుకొస్తాడో చూడాలి.

‘విన్నర్’ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చి ఉండొచ్చు కానీ.. చివరికి ఆ సినిమా పెద్ద కమర్షియల్ ఫెయిల్యూర్ అవుతుందని బాక్సాఫీస్ పండిట్ల అంచనా. కలెక్షన్ల మాట పక్కన పెడితే ఈ సినిమాపై చాలా విమర్శలొచ్చాయి. కాలం చెల్లిన ఇలాంటి కథలతో ఇంకెన్నాళ్లు అన్న అభిప్రాయాలు వినిపించాయి. ఈ తరహా సినిమాలు ఔట్ డేట్ అయిపోయాయి. ఒకప్పుడైతే ఇలాంటి ఫార్ములా కథలు చెబితే స్టార్ హీరోలు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేవారు కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. దాదాపుగా అందరు స్టార్ హీరోలూ వైవిధ్యమైన కథల వైపు చూస్తున్నారు.

ఒక టైంలో రొడ్డకొట్టుడు మాస్ సినిమాలు చేస్తూ వచ్చిన రామ్ చరణ్.. బాలకృష్ణ లాంటి హీరోలు కూడా మారిపోయి వైవిధ్యమైన కథల వైపు చూస్తున్నారు. మిగతా హీరోలందరూ ఎప్పుడో కొత్త కథల వైపు మళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ‘విన్నర్’ లాంటి ఫార్ములా సినిమాతో వచ్చిన గోపీచంద్‌తో పని చేయడానికి ఏ స్టార్ హీరో ముందుకొస్తాడో చూడాలి.