అల్లు అర్జున్‌ అప్పుడే చిరంజీవి అయిపోయాడా?

‘దువ్వాడ జగన్నాథమ్‌’ ఆడియో వేడుకలో అల్లు అర్జున్‌ గురించి హరీష్‌ శంకర్‌ తెగ పొగిడేసాడు. అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే ఎలా కనిపిస్తుందో, అల్లు అర్జున్‌కి సక్సెస్‌ మాత్రమే టార్గెట్‌గా కనిపిస్తుందని అన్నాడు. అలాగే తనకి కావాల్సిన విధంగా కథ రెడీ అయ్యే వరకు తనని పుష్‌ చేసాడని, ఒక దర్శకుడిని మాగ్జిమమ్‌ పుష్‌ చేసి తనకి కావాల్సింది రాబట్టుకునే ఏకైక హీరో అల్లు అర్జున్‌ అని అన్నాడు.

రవితేజ, పవన్‌కళ్యాణ్‌, ఎన్టీఆర్‌లాంటి బడా హీరోలతో చేసిన దర్శకుడి నుంచి వచ్చిన ఈ మాటని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అలాగే క్లయిమాక్స్‌ ఎలా వుండాలనేది కూడా అల్లు అర్జున్‌ డిసైడ్‌ చేసాడని, క్లయిమాక్స్‌లో ఫైట్‌ లేకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ మీదే ఫోకస్‌ పెట్టమని అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా మేరకు అలాగే పతాక సన్నివేశం తీసామని హరీష్‌ చెప్పాడు. దీనిని బట్టి కథ ఎలాగుండాలి, ఏ సీన్‌ ఎలా వుండాలి, ఎక్కడ పాట వుండాలి, ఎక్కడ ఫైటుండాలి వంటివన్నీ అల్లు అర్జున్‌ చెప్పి చేయించుకున్నట్టు స్పష్టమవుతుంది. అంటే ఒక రకంగా ఈ చిత్రానికి ‘డైరెక్టర్‌’ అల్లు అర్జున్‌ అన్నమాట. ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత మళ్లీ అంతగా సక్సెస్‌ కాలేకపోయిన హరీష్‌ శంకర్‌ హీరోని మచ్చిక చేసుకోవడం కోసం అతను ఏది అడిగితే అది చేసేసినట్టు అనిపిస్తోంది.

చిరంజీవి అంతటోళ్లు తప్ప దర్శకుడి పనిలో మిగతావాళ్లు ఈ రేంజిలో ఇంటర్‌ఫియర్‌ అవరు. ఇదే పని త్రివిక్రమ్‌ లేదా కొరటాల శివ చిత్రానికి అల్లు అర్జున్‌ చేసే ధైర్యం చేయకపోవచ్చు. ‘చెప్పింది చేసే’ దర్శకులతో హిట్టు సినిమా తీయించుకోగలననే బన్నీ ఇలా చేస్తున్నాడా? అతని మలి చిత్రం కొత్త దర్శకుడు వక్కంతం వంశీతో కనుక అక్కడ కూడా తన అజమాయిషీనే వుంటుందేమో. హిట్టిచ్చే దర్శకులని నమ్ముకునే దశ నుంచి, ఇతనితో హిట్‌ చేయించుకోగలననే ధీమా వరకు అల్లు అర్జున్‌ ఎదిగిపోయాడని కామెంట్‌ చేస్తున్నారు సినీ జనాలు.