స్పైస్ జెట్‌ను జ‌స్ట్ టూ రూపీస్‌కు కొన్నాడు

ఒక సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. రెండు రూపాయిల‌కు మంచి చాక్లెట్ కూడా రాని రోజుల్లో ఒక విమాన‌యాన కంపెనీని క‌ట్ట‌బెట్టేసిన సంచ‌ల‌న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. బోలెడ‌న్ని విమానాలు.. అంత‌కు మించిన అప్పులున్న కంపెనీకి కేవ‌లం రెండు రూపాయిల‌కే చేతులు మారిన వైనం తాజాగా వెలుగులోకి వ‌చ్చి నోటి వెంట మాట రాకుండా చేస్తోంది.

ఒక‌ప్పుడు విమాన‌యాన రంగంలో సంచ‌ల‌నం సృష్టించి.. త‌ర్వాతి రోజుల్లో మేనేజ్ మెంట్ త‌ప్పుల‌తో అప్పుల పాలైన స్పైస్ జెట్ కేవ‌లం రెండు రూపాల‌కే చేతులు మారిపోయింద‌ట‌. అంత చౌక‌గా స్పైస్ జెట్ వాటాను సొంతం చేసుకున్నారు ఒక‌ప్ప‌టి ఆ కంపెనీ వ్య‌వ‌స్థాప‌కులు.. ప్ర‌స్తుత ఛైర్మ‌ణ్ అయిన అజ‌య్ సింగ్‌.

దేశీయ లిస్టెడ్ కంపెనీల చ‌రిత్ర‌లో ఇంత కారుచౌక‌గా ఒక కంపెనీ చేతులు మారిన వైనం ఇంత‌వ‌ర‌కూ ఎప్పుడూ చూసింది లేదు. కానీ.. రూ.2ల‌కే స్పైస్ జెట్ యాజ‌మాన్య హ‌క్కులు చేతులు మారిన విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాదాపు రెండున్న‌రేళ్ల క్రితం మూసివేత‌కు సిద్ధంగా ఉన్న స్పైస్ జెట్‌.. తాజాగా లాభాల్లోకి రావ‌టం తెలిసిందే. ఈ కంపెనీలోని 58.46 శాతం వాటాను అక్ష‌రాల రెండురూపాయిల‌కే మార‌న్ చేతులు మీదుగా సొంతం చేసుకున్నారు అజ‌య్ సింగ్‌.

అప్పుల పాలైన స్పైస్ జెట్ చేతులు మారిన విష‌యం అంద‌రికి తెలిసినా.. డీల్ ఎంత‌న్న‌ది బ‌య‌ట‌కు రాలేదు. కేవ‌లం 15 రోజుల్లోనే కంపెనీ చేతులు మారే డీల్ పూర్తి అయ్యింది. అయితే.. ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించాల్సిన ఓపెన్ ఆఫ‌ర్ ను వెల్ల‌డించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. రెండు రూపాయిల‌కే స్పైస్ జెట్‌ను అమ్మేసిన వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి హాట్ టాపిక్ మారింది. ప్ర‌స్తుతం స్పైస్ జెట్ షేర్ విలువ రూ.125 ఉండ‌గా.. రెండున్న‌రేళ్ల క్రితం చేతులు మారే వేళ‌లో రూ.21.8గా ఉండేది. ఆ ప్ర‌కారంగా చూసినా ప్ర‌మోట‌ర్ మార‌న్ వాటా రూ.765 కోట్లుగా ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ రూ.2ల‌కే సంస్థ‌ను అప్ప‌జెప్పేయ‌టం అవాక్కు అయ్యేలా చేస్తోంది. ఇక‌.. రూ.2ల‌కు కొనుగోలు చేసిన సింగ్ స్పైస్ జెట్ వాటా విలువ ఎంతో తెలుసా? అక్ష‌రాల రూ. 4400 కోట్ల మేర ఉంటుంది.

ఈ సంచ‌ల‌న విష‌యాన్ని అమ్మిన పెద్ద‌మ‌నిషి.. కొన్న పెద్దాయ‌న బ‌య‌ట పెట్ట‌లేదు. నిజానికి లిస్టెడ్  కంపెనీల‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యం ఇన్వెస్ట‌ర్ల‌కు తెలియాలి. కానీ.. అలా తెలీకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం షాకింగేన‌ని చెప్పాలి. స్పైస్ జెట్ అమ్మ‌కానికి సంబంధించిన డీల్ రూల్స్‌ను కొనుగోలు చేసిన సింగ్ గౌర‌వించ‌టం లేదంటూ మార‌న్ న్యాయ‌పోరాటం సాగిస్తున్న వేళ‌లో.. బ్లూమ్ బ‌ర్గ్ తాజాగా ఈ సంచ‌ల‌న విష‌యాల్ని వెల్ల‌డించింది. మార‌న్ చేతుల్లో నుంచి సింగ్ చేతుల్లోకి స్పైస్ జెట్ మారే వేళ‌లో కంప‌నీ మీద దాదాపు రూ.2వేల కోట్ల మేర రుణ‌భారం ఉండేది. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. న‌ష్టాల్లో ఉన్న స్పైస్ జెట్‌ను లాభాల్లోకి తీసుకొచ్చారు. ఏమైనా రూ.2ల‌కే అంత పెద్ద కంపెనీని చేజిక్కించుకోవ‌టం మార్కెట్ వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.