ఆ ఫైట్‌ సీన్‌ ఖర్చుతో సినిమా తీయొచ్చు

‘బాహుబలి’తో దక్షిణాది సినిమా రేంజ్‌ ఎందాకా వెళ్లగలదనేది ప్రూవ్‌ అవడంతో ‘రోబో’ సీక్వెల్‌ అయిన ‘2.0’ కోసం శంకర్‌ లెక్క లేకుండా ఖర్చు పెట్టేస్తున్నాడు. మామూలుగానే హై బడ్జెట్‌ సినిమాలు తీసే శంకర్‌ 2.0ని భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన చిత్రాల సరసన నిలబెట్టబోతున్నాడు.

ఇందులోని ప్రతి సీన్‌కీ జనం నోరు వెల్లబెట్టి చూడాలనే లక్ష్యంతో శంకర్‌ దీనిని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నాడు. ఒక అద్భుతమైన ఫైట్‌ సీన్‌ కోసం శంకర్‌ ఏకంగా పన్నెండు కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాడట. ఆ ఖర్చుతో ఒక మీడియం రేంజ్‌ సినిమా తీసేయవచ్చు. శతమానం భవతి చిత్రాన్ని ఇంతకంటే తక్కువ బడ్జెట్‌లో తీసి ముప్పయ్‌ కోట్లు రాబట్టాడు దిల్‌ రాజు. అంత ఖర్చుతో శంకర్‌ ఒకే ఒక్క ఫైట్‌ సీన్‌ తీస్తున్నాడు.

రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌ల మధ్య వచ్చే ఫస్ట్‌ ఫైట్‌ కావడంతో ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకి గురవ్వాలని శంకర్‌ భావిస్తున్నాడు. కేవలం విజువల్స్‌ కోసమే ఈ చిత్రానికి మళ్లీ మళ్లీ రావాలన్న రీతిలో శంకర్‌ 2.0ని విదేశీ చిత్రాలకి తీసిపోని గ్రాండియర్‌తో తీస్తున్నాడట. బాహుబలి 2 చూసిన వాళ్లకి 2.0 ఒక సాధారణ చిత్రంలా అనిపించకూడదని, ఇదీ ప్రత్యేకమైనది, ప్రతిష్టాత్మకమైనది అనిపించేలా కళ్లు చెదిరే విన్యాసాలు, వింతలు వుండాలని శంకర్‌ ఒక తపస్సులా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.