‘ది కంక్లూజన్’ వేడుకలో అసలైన హైలైట్స్

‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రి రిలీజ్ ఈవెంట్ అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. మామూలుగా తెలుగులో జరిగే ఆడియో.. ప్రి రిలీజ్ ఈవెంట్లకు భిన్నంగా అనిపించింది ఈ వేడుక. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ఈవెంట్లో ఎన్నో ప్రత్యేకతలు కనిపించాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మూడు నాలుగు అంశాలున్నాయి.

తన తమ్ముడు రాజమౌళి గురించి ‘ఎవ్వడంట ఎవ్వడంట..’ పాట స్ఫూర్తితో ‘ఎవ్వడంట ఎవ్వడంట బాహుబలి తీసింది.. మా పిన్ని కన్నది ఈ నంది కాని నంది’ అంటూ కీరవాణి స్వయంగా పాట రాసి.. దాన్ని వేదిక మీద ఆలపించడం.. అది చూసి రాజమౌళి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం ఈ వేడుకలో మేజర్ హైలైట్. ఎప్పుడూ నవ్వుతూ లేదా గంభీరంగా కనిపించే రాజమౌళి.. ఇలా ఎమోషనల్ అవడం ఎవ్వరూ చూసి ఉండరు. ఇది ఎంతమాత్రం డ్రమటిగ్గా అనిపించలేదు. నిజమైన ఎమోషన్ కనిపించింది ఆ సమయంలో.

ఇక ‘బాహుబలి’ గురించి మనవాళ్లు ఎంత పొగిడినా మామూలే కానీ.. బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడైన కరణ్ జోహార్ ఈ వేడుకకు విచ్చేసి.. ఈ చిత్రాన్ని ‘మొఘల్ ఎ అజామ్’తో పోల్చడం.. ఆ సినిమా తర్వాత ఇండియన్ సినిమా తలెత్తుకునేలా చేశాడని రాజమౌళికి కితాబివ్వడం.. తాను రాజమౌళి తీసిందాంట్లో పది శాతం కూడా తీయలేదని.. వేలమంది దర్శకుల్ని రాజమౌళి ఇన్‌స్పైర్ చేశాడనడం.. స్పీల్ బర్గ్, కామెరూన్, నోలన్ లాంటి హాలీవుడ్ లెజెండ్స్‌తో రాజమౌళిని పోల్చడం వేడుకలో మరో మేజర్ హైలైట్.

ఇక మాటల సంగతలా ఉంచితే విజువల్‌గా ఈ వేడుకకు ప్రత్యేకంగా నిలిచింది ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీనే. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా స్టేజ్ మీది నుంచి క్రేన్ సాయంతో రోప్ కట్టి ప్రభాస్ ను కిందికి దించడం.. కళ్లు చెదిరిపోయేలా చేసింది. ఒక సినీ వేడుకలో హీరో ఇలా ఎంట్రీ ఇవ్వడం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి అయ్యుండొచ్చు. అంతకుముందు తన పెదనాన్న కృష్ణం రాజు వేదిక ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే ప్రభాస్ పరుగు పరుగున వెళ్లి ఆయనకు భుజం కాసి స్టేజ్ మీదికి తీసుకెళ్లడం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది.