పీఏ వైపో?.. కార్యకర్తల వైపో?.. తేల్చుకో’ బాలయ్య

త‌న పీఏ కనుమూరి శేఖర్ వివాదం తారాస్థాయికి చేరుతున్న సినీన‌టుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగుతున్న‌ట్లు తెలుస్తోంది. హిందూపురం టీడీపీలో నెలకొన్న పరిస్థితులను అటు టీడీపీ అధిష్ఠానం, ఇటు ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నుంచి ప్రత్యేక పరిశీలకులు వచ్చి ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు ఎమ్మెల్యే బాలయ్య కూడా హిందూపురం వచ్చి వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించి తగిన రీతిలో స్పందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు నియోజకవర్గంలోని టీడీపీ అసంతృప్త నేతలు మ‌రోమారు అల్టిమేటం జారీ చేశారు. పీఏను వెంటనే తప్పించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్ర‌క‌టించారు. పీఏ శేఖర్ వ్యతిరేక వర్గం ఆదివారం హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు సమీపంలో పెద్దఎత్తున సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆ సమావేశానికి టీడీపీ శ్రేణులు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ఉన్నఫలంగా 144 సెక్షన్ ఆంక్షలు, పోలీసు 30 యాక్టు విధించింది. దీనికి తోడు గ్రామస్థాయిలో పోలీసు పహారా ఏర్పాటు చేసింది. అయితే అసంతృప్తనేతలు ఎత్తుకు పైఎత్తులు వేసి చివరకు హిందూపురం నియోజకవర్గానికి సమీపంలో కర్నాటకలోని బాగేపల్లి వద్ద సమావేశం నిర్వహించారు.

బాగేపల్లి వద్ద కూడా కర్నాటక పోలీసులు ఇబ్బందులు సృష్టించినా అసంతృప్త నేతలు మాత్రం సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మినారాయణ మాట్లాడుతూ వారం రోజుల్లోగా ఎమ్మెల్యే బాలయ్య పిఏ శేఖర్‌ను తప్పించకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు. ‘శేఖర్.. నీకు నందమూరి కుటుంబంపైనా, నారా కుటుంబంపైనా ఏమాత్రం అభిమానం ఉన్నా తక్షణం మూటా, ముల్లే సర్దుకుని వెళ్లిపో’ అని సూచించారు. నీ అవినీతి, అక్రమాల కారణంగా ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీకి ఎంతో చెడ్డపేరు వచ్చింది, మేమిక సహించం అంటూ హుకూం జారీ చేశారు.

ఇప్పటికైనా బాలయ్య ఆలోచించి శేఖర్‌ను తక్షణమే పంపించాలని విజ్ఞప్తి చేశారు.నందమూరి పురంగా పేరుగాంచిన హిందూపురంలో శేఖర్ వైఖరి కారణంగా టీడీపీ ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. శేఖర్‌ను వారం రోజుల్లోగా తప్పించకపోతే హిందూపురం ఎన్టీఆర్ సర్కిల్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని స్పష్టం చేశారు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం కూడా జోక్యం చేసుకోవాలని, లేకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఇదిలాఉండ‌గా….అసంతృప్త నేతల సమావేశం జరగకుండా శాంతిభద్రతల పేర పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నలుగురు డీఎస్పీలు, 10 మంది సిఐలు, 22 మంది ఎస్‌ఐలతో పాటు స్పెషల్ పార్టీ బృందాలను ఏర్పాటు చేయగా అసంతృప్త నేతలు ఎత్తుకు పైఎత్తులు వేసి నియోజకవర్గం సమీపంలోని కర్నాటకలో బాగేపల్లి వద్ద సమావేశాన్ని నిర్వహించి సఫలీకృతులయ్యారు. ఓవైపు ఆంధ్ర, మరోవైపు కర్నాటక పోలీసుల నుంచి వత్తిళ్లు వచ్చినా అసంతృప్త నేతలు వందలాది సంఖ్యలో హాజరు కావడం జిల్లాలో దుమారం రేపుతోంది.