బాహుబలి’కి ముందు.. ‘బాహుబలి’కి తర్వాత

రానా దగ్గుబాటి కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు.. ‘బాహుబలి’కి తర్వాత అని విభజించి చెప్పాలి. ఆ సినిమా తర్వాత అతడి రేంజే మారిపోయింది. టాలీవుడ్ మొదలు అన్ని ఇండస్ట్రీల వాళ్లకు అతను మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. త్వరలోనే ‘ఘాజీ’ లాంటి మరో సంచలన సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న రానా.. త్వరలోనే మరో చారిత్రక కథాంశంతో తెరకెక్కబోయే సినిమాలో నటిస్తాడట.

70 ఏళ్ల కిందట.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఒక సైనికుడి కథతో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు రానా. ఈ చిత్రం తమ సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లోనే తెరకెక్కనుందట. దీని దర్శకుడు ఇతర వివరాలు తర్వాత వెల్లడిస్తానని.. ప్రస్తుతం స్క్రిప్టు తుది దశకు వచ్చిందని రానా తెలిపాడు.

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెలుగులో చేస్తున్న సినిమా అనంతపురం పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోందని.. తమిళంలో ఒక భారీ సినిమా చేయనున్నానని.. తనే సొంతంగా ఒక బేనర్ పెట్టి అక్కినేని నాగచైతన్య హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నానని రానా తెలిపాడు. ఇక తన లేటెస్ట్ మూవీ ‘ఘాజీ’ ఎలా తెరమీదికి వచ్చిందో చెబుతూ..  ‘‘ఆస్ట్రేలియాలో సినిమాటోగ్రఫీలో శిక్షణ పొందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో తన అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పై సబ్‌మెరైన్‌ సెట్‌ వేశాడు.

అది నిర్మాత రామ్మోహనరావు కంట్లో పడింది. ఏంటా అని ఆరా తీస్తే తాను బ్లూఫిష్‌ పేరిట షార్ట్‌ఫిల్మ్‌ తీయడానికి సన్నాహాలు చేస్తున్నానని ఆ యువకుడు చెప్పాడు. ఆ యువకుడే సంకల్ప్ రెడ్డి. అతను చెప్పిన కథ నచ్చడంతో దాన్నే ‘ఘాజీ’గా వెండితెరపైకి తీసుకొచ్చాం. ఇలాంటి సినిమాలో నటించడం నాకు లైఫ్ టైం ఎక్స్‌పీరియన్స్’’ అని రానా తెలిపాడు.