‘సర్దార్’తో పోలిస్తే ‘రాయుడు’ మేలే కానీ.

‘కాటమరాయుడు’ అంచనాల్ని అందుకోవడంలో విఫలమయ్యాడు. సినిమా మీద ముందు ఉన్న హైప్ వల్ల తొలి రోజు ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి కానీ.. తర్వాత బాక్సాఫీస్ పరీక్షకు సినిమా నిలిచేలా కనిపించట్లేదు. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.22 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు ఐదు కోట్ల పైచిలుకు షేర్ మాత్రమే రాబట్టింది. ఆదివారం వసూళ్లు కొంచెం మెరుగ్గానే ఉన్నాయి కానీ.. బయ్యర్లు ఆశించిన స్థాయిలో అయితే లేవు.

వరల్డ్ వైడ్ వీకెండ్ షేర్ రూ.42 కోట్లకు అటు ఇటుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫస్ట్ వీకెండ్లోనే రూ.40 కోట్లకు పైగా షేర్ అంటే సంతోషించాల్సిన విషయమే కానీ.. ‘కాటమరాయుడు’ అమ్మకాలతో పోలిస్తే.. మాత్రం ఇది తక్కువ మొత్తమే. కనీసం రూ.50 కోట్ల వస్తే తప్ప ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ వైపు నడుస్తున్నట్లు కాదు.

మొత్తానికి వీకెండ్ వసూళ్ల తీరు చూస్తే ‘కాటమరాయుడు’ లాస్ వెంచర్ కావడం ఖాయమని తేలిపోతోంది. కాకపోతే నష్టం ఏ స్థాయిలో ఉంటుందన్నదే తేలాల్సి ఉంది. సోమవారం వసూళ్లలో మరీ డ్రాప్ లేకుంటే ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.60 కోట్ల షేర్ మార్కును దాటుతుందని ఆశించవచ్చు. ఈ వారాంతంలో ఒకటికి నాలుగు సినిమాలొస్తున్నాయి. అందులో రెండు చెప్పుకోదగ్గ చిత్రాలే. వాటి ప్రభావం ‘కాటమరాయుడు’ మీదే ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

అవేవీ కూడా మాస్ ప్రేక్షకుల్ని అంత ఆకర్షించే సినిమాలు కాకపోవడం ‘కాటమరాయుడు’కు కలిసి రావచ్చు. స్టూడెంట్స్ అందరూ ఫ్రీ అయిపోతున్నారు కాబట్టి ‘కాటమరాయుడు’ సెకండ్ వీకెండ్లో కూడా ఓ మోస్తరు వసూళ్లు సాధించే అవకాశముంది. ఐతే ఎంత వసూలు చేసినా బ్రేక్ ఈవెన్‌కు దరిదాపుల్లో అయితే సినిమా ఉండే అవకాశం లేదు. తక్కువలో తక్కువ రూ.20 కోట్లయినా బయ్యర్లకు కోత పెడుతుందని భావిస్తున్నారు. ‘సర్దార్’తో పోలిస్తే నష్టాలు తక్కువ ఉండొచ్చేమో కానీ.. నష్టాలైతే తప్పవన్నది ట్రేడ్ పండిట్స్ అంచనా.

https://www.youtube.com/watch?v=DGT3YFZMEng