కీరవాణి రిటైర్మెంట్ కోసం తమన్ తహతహ?

2016 డిసెంబర్లో సంగీత దర్శకుడిగా రిటైరైపోతానంటూ మూడేళ్ల కిందట ఎం.ఎం.కీరవాణి చేసిన ప్రకటన అప్పట్లో ఓ సంచలనమే. ఎంత పెద్ద సంగీత దర్శకుడైనా అవకాశాలు తగ్గి మ్యూజిక్ డైరెక్షన్ మానుకోవడమే తప్ప.. ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం అరుదైన విషయమే.

ఐతే ముందు చేసిన ప్రకటనకు కట్టుబడకుండా అభిమానుల ఆకాంక్షల మేరకు సినిమాల్లో కొనసాగాలనే నిర్ణయించుకున్నాడు కీరవాణి. ఆయన నిర్ణయం సంగీత ప్రియులకు ఆనందాన్నిచ్చేదే. తాను రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించినపుడు మెజారిటీ సంగీత ప్రియులు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమనే చెప్పారని.. చాలా కొద్దిమంది మాత్రమే ఆ నిర్ణయానికి సంతోషించారని కీరవాణి చెప్పాడు.

ఈ సందర్భంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రం తన రిటైర్మెంట్ మీద చాలా క్యూరియస్ గా ఎదురు చూశాడని కీరవాణి వెల్లడించడం విశేషం. ఐతే అతడి గురించేమీ కీరవాణి నెగెటివ్‌గా మాట్లాడలేదు. తమన్ కూడా తనకు అభిమానే అని.. ఐతే తన దగ్గర పని చేసే జీవన్ కోసమే అతను తన రిటైర్మెంట్ మీద కుతూహలం ప్రకటించాడని కీరవాణి తెలిపాడు. ఈరోజుల్లో.. బస్ స్టాప్.. ప్రేమకథా చిత్రమ్ లాంటి సినిమాలకు సంగీతాన్నందించిన జీవన్ గురించే కీరవాణి చెప్పింది.

అతను కీరవాణి టీంలో సభ్యుడు. తాను సంగీతం మానేస్తే జీవన్‌ను తన దగ్గర పెట్టుకోవచ్చనే ఉద్దేశంతో తమన్ తన రిటైర్మెంట్ మీద కుతూహలం ప్రదర్శించాడని.. ఎప్పటికప్పుడు జీవన్ దగ్గర దీని గురించి మాట్లాడేవాడని కీరవాణి చెప్పడం విశేషం. కీరవాణి చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఆయన రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడం తమన్‌కు నిరాశ కలిగించే ఉంటుందన్నమాట.

https://www.youtube.com/watch?v=pYUMf5Irado