ఇంతకీ బ్రహ్మి అయినా ఉన్నాడా?

‘ఖైదీ నెంబర్ 150′ తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్లో ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ అంటూ ఏమీ ఉండవు. హీరో పక్కన ఒక కమెడియన్ ఉంటాడు. అతనే అప్పుడప్పుడూ వినోదం పంచుతుంటాడు. హీరో పాత్రతోనే ఎంటర్టైన్మెంట్ పండించే ప్రయత్నం చేశాడు మురుగదాస్. ఐతే తెలుగు వెర్షన్‌కు వచ్చేసరికి అది సరిపోదని.. మన ప్రేక్షకుల అభిరుచి వేరని.. భావించి ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ జోడించింది వి.వి.వినాయక్ అండ్ కో.

ఇంతకుముందు ‘ఠాగూర్’ లాంటి సినిమాల విషయంలోనూ ఇలాగే చేసి విజయవంతమయ్యారు. ఐతే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ట్రెండు మారింది. ఒకప్పట్లా సెపరేట్ కామెడీ ట్రాక్స్ ఇప్పుడు వర్కవుట్ కావట్లేదు. పైగా ప్రివ్యూ చూసిన వాళ్ల నుంచి ఈ విషయంలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఇప్పుడు పునరాలోచనలో పడ్డారట. ఇందులో భాగంగా ముందు కమెడియన్ పృథ్వీ మీద తీసిన ట్రాక్ లేపేశారట. ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీనే కన్ఫమ్ చేశాడు.

దీంతో ఇప్పుడందరి దృష్టీ బ్రహ్మానందం మీద పడింది. ‘ఖైదీ నెంబర్ 150′ కోసం ఆయన మీద కూడా కొన్ని కామెడీ సీన్లు తీశారట. చిరంజీవి పట్టుబట్టి బ్రహ్మిని ఈ సినిమా కోసం రప్పించారని.. ఆయన కాంబినేషన్లు కామెడీ సీన్లు తీశారని అంటున్నారు. మరి బ్రహ్మి ట్రాక్ అయినా ఉంచారా.. లేక తీసేశారా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బ్రహ్మి కెరీర్ అసలే బాలేని టైంలో ఇలా కామెడీ ట్రాక్ లేపేశారంటే ఆయనకు మరింత డ్యామేజ్ జరుగుతుంది. బ్రహ్మి గురించి నెగెటివ్ ప్రచారం మరింత ఊపందుకుంటుంది. మరి సినిమాలో బ్రహ్మి పాత్ర ఎంతమాత్రమో చూడాలి.