ముంద‌స్తు ఎన్నిక‌లు..ఆ వ్యూహ‌క‌ర్త‌తో జ‌గ‌న్ మీటింగ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల వేడి షురూ అయింది. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ ముఖ్యుల‌తో చ‌ర్చిస్తూ 2018లోనే ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీనిపై జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం రియాక్ట‌య్యారు. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే ఎదుర్కునేందుకు జ‌న‌సేన సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైతం త‌న ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ తో భేటీ అయిన‌ట్లు స‌మాచారం.

విజ‌య‌వాడ‌లో వైఎస్ జ‌గ‌న్‌-ప్ర‌శాంత్ కిశోర్‌ల మ‌ధ్య స‌మావేశం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే అనుస‌రించాల్సిన వ్యూహాల గురించి చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. అయితే ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని ప్ర‌శాంత్ కిశోర్ విశ్లేషించిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగానే ఎన్నిక‌ల హామీల‌పై క‌స‌ర‌త్తు చేయాల‌ని పార్టీ నేత‌ల‌కు జ‌గ‌న్ సూచించిన‌ట్లు స‌మాచారం.

కాగా,  2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో సుపరిపాలనకు చిహ్నంగా మోడీని నిలిపేందుకు సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (కాగ్) బృందాన్ని ఏర్పాటు చేశారు. మోడీ కోసం చాయ్ పే చర్చ సహా పలు సృజనాత్మక ప్రచార వ్యూహాలను రూపొందించాడు. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గెలుపున‌కు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలే కీల‌కం. అయితే 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అదే మోడీకి వ్య‌తిరేకంగా నితీశ్ కుమార్ విజ‌యం కోసం శ్ర‌మించారు. నితీశ్‌కు మ‌ద్ద‌తుగా రోడ్లపై అతిపెద్ద హోర్డింగ్‌ల ఏర్పాటు నుంచి సోషల్ మీడియాలో ప్రత్యర్థుల ప్రచారాన్ని ఖండించ‌డం, ఆస‌క్తిక‌ర పోస్టింగ్‌ల‌తో యువ‌త‌ను ఆక‌ట్టుకోవ‌డం వంటి కొత్త ఎత్తుగ‌డ‌ల‌న్నీ కిశోర్ బృందం నేతృత్వంలోనే సాగింది. నితీశ్‌కుమార్ కోసం చాయ్‌పే చర్చను పర్చాపే చర్చ (కరపత్రాలపై చర్చ)గా మార్చారు.

పదేళ్లుగా నితీశ్ నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరు గురించి ప్రజాభిప్రాయం సేకరించారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీ నేతలంతా హెలికాప్టర్లలో బీహార్ చుట్టేస్తుంటే…నితీశ్, ఆయన పార్టీ నేతలు మాత్రం ఇంటింటికి తిరిగి ప్రచారం సాగించడం కలిసొచ్చింది. అలా నితీశ్‌ను విజ‌య‌తీరానికి చేర్చాడు ప్ర‌శాంత్ కిశోర్‌. కాగా, బీహార్‌లోని బక్సార్‌లో జన్మించిన కిశోర్ ఐక్య‌రాజ్య‌స‌మితి త‌ర‌ఫున‌ ఆఫ్రికాలో ఆరోగ్య నిపుణుడిగా చేస్తున్న ఉద్యోగం వదులుకుని 2011లో భారత్‌కు వచ్చారు.