వెయ్యి కోట్ల సినిమా.. హంబక్ అంటున్నాడే

వెయ్యి కోట్ల రూపాయలతో మహాభారతం.. అందులో భీముడిగా మోహన్ లాల్.. గత కొన్ని రోజులుగా భారతీయ సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అవుతున్న వార్త ఇది. దుబాయ్‌కి చెందిన బీఆర్ శెట్టి అనే బిజినెస్ మ్యాన్ ఈ వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యాడని.. మోహన్ లాల్ అన్నీ తానై ఈ సినిమాను నడిపించబోతున్నాడని.. రెండేళ్లకు పైగా ఈ సినిమాకే అంకితం కాబోతున్నాడని.. ఇప్పట్నుంచే అందుకోసం శిక్షణ కూడా తీసుకోబోతున్నాడని అన్నారు.

ఐతే ఈ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చే అవకాశమే లేదని అంటున్నాడు బాలీవుడ్లో పెద్ద క్రిటిక్‌గా తనకు తాను డబ్బా కొట్టుకునే కమల్.ఆర్.ఖాన్.

వెయ్యి కోట్లతో మహాభారతం సినిమా అని.. మోహన్ లాల్ అందులో భీముడని వార్తలు రావడం ఆలస్యం.. మలయాళ సూపర్ స్టార్ మీద ఇంతెత్తున లేచాడు కమల్. మోహన్ లాల్ భీముడి పాత్రకు పనికి రాడని.. అతను ఛోటాభీమ్ పాత్రకైతే ఓకే అని అతను ఎద్దేవా చేశాడు. దీంతో లాల్ అభిమానులకు మండిపోయింది. సోషల్ మీడియాలో అతడిపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు.

రెండు రోజులుగా ఈ వార్ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఐతే లాల్‌తో పాటు అభిమానుల్ని ఇష్టానుసారం తిట్టిపోసిన కమల్ ఆర్.ఖాన్.. మహాభారతం సినిమాకు నిర్మాతగా చెప్పుకుంటున్న బీఆర్ శెట్టితో తాను మాట్లాడానని.. మోహన్ లాల్ తనతో ఈ ప్రాజెక్టు గురించి చర్చించినప్పటికీ తాను నిర్మాణానికి పచ్చ జెండా ఊపలేదని.. ఈ లోపే తన పేరుతో ప్రకటన ఇచ్చేసి లాల్ హడావుడి చేస్తున్నానని.. తానింకా ఈ ప్రాజెక్టుకు రెడీగా లేనని అతను చెప్పాడని కమల్ వెల్లడించాడు. మరి కమల్ లాల్ మీద దాడిలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడా.. లేక అతను చెబుతున్నది నిజంగా నిజమేనా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశముంది.