ఎన్.టి.ఆర్ 13 ఏళ్లకే అదరగొట్టిన ‘బాల రామాయణం’కి 24 ఏళ్ళు.!

24 ఏళ్ల క్రితం ఎవ్వరైనా అనుకున్నారా, తారకరాముడు తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వించే నటుడిగా ఎదుగుతాడని, ఎవ్వరైనా అనుకున్నారా ఆ బాల నటుడు ఆబాలగోపాలాన్ని మెప్పించే డ్యాన్సర్ అవుతాడని, కొంచెమైనా ఆలోచన ఉందా, తొలి సినిమాతోనే అందరినీ మెప్పించిన ఆ బాలుడు తర్వాత ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తాడని. సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఇదే రోజున నందమూరి తారక రామారావు బాల నటుడిగా చేసిన బాల రామాయణం విడుదలైంది. అప్పటినుండి మొదలైన సంచలనాలు 24 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. 25వ ఏటికి ఉచ్చ స్థాయిని అందుకోనున్నాయి.

ఎన్టీఆర్ ఈ 24 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసాడు, జయాపజయాలు చవిచూశాడు. రికార్డులను తిరగరాశాడు, కొత్త సంచలనాలకు తెరతీశాడు. అయితే వీటన్నిటికీ మూలం మాత్రం 24 ఏళ్ల క్రితం చేసిన బాల రామాయణమే. గుణశేఖర్ దర్శకత్వంలో దాదాపు 5,000 మంది పిల్లలతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం. జాతీయ స్థాయి అవార్డును సైతం అందుకుందీ చిత్రం. బాలనటుడిగానే మెప్పించిన ఎన్టీఆర్ ఆ తర్వాత నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కాడు. రామచంద్రుడి పాత్రను 13 ఏళ్ల ప్రాయంలోనే ఈ తారక రాముడు పోషించిన విధానానికి అందరూ ఆశ్చర్యపోయారు. అంతటి చిన్న వయసులో నటనలో ఎన్టీఆర్ చూపించిన పరిణితికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. అప్పటినుండి ఇంతింతై అంటూ ఎదిగిన ఎన్టీఆర్ నట వృక్షమై నేడు కోట్లాది మందిని అలరిస్తున్నాడు.

ప్రస్తుతం రాజమౌళి సరసన ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. 1920ల కాలం నాటి కథగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కనుంది. నైజాం నవాబుల దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించిన మహోన్నతుడిగా కొమరం భీమ్ కు సుపరిచిత స్థానముంది. మరి ఎలాంటి పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేయగల తారక రాముడు జక్కన్న దర్శకత్వంలో కొమరం భీమ్ పాత్రను ఎలా పోషించనున్నాడో చూడాలి.