కళ్యాణ్ రామ్.. బాబాయితో కయ్యమా?

పోయినేడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ మూవీ ‘డిక్టేటర్’.. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ బాక్సాఫీస్ పోటీకి దిగాయి. నిజానికి ముందు బాబాయి-అబ్బాయి ఒకేసారి బాక్సాఫీస్ యుద్ధానికి దిగబోతున్నారంటే జనాలకు నమ్మకం కలగలేదు. ఇది పబ్లిసిటీ కోసం జరుగుతున్న ప్రచారమని అనుకున్నారు. కానీ చివరికి నిజంగానే బాబాయ్-అబ్బాయ్ పోటీ పడ్డారు. రిజల్ట్ ఏంటో తెలిసిందే. ‘డిక్టేటర్’ మీద ‘నాన్నకు ప్రేమతో’ స్పష్టమైన పైచేయి సాధించింది. ఇది బాలయ్యకు కచ్చితంగా ఇబ్బందికరంగానే అనిపించి ఉంటుంది. ఎన్టీఆర్ మీద అప్పటికే ఉన్న వ్యతిరేకత పెంచి ఉంటుందని అంతా అనుకున్నారు.

ఐతే బాలయ్య.. ఎన్టీఆర్ కొన్నేళ్ల కిందట్నుంచే దూరం మొదలైంది. అంతకంతకూ అగాథం పెరుగుతూ వస్తోంది. కానీ ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ మాత్రం బాబాయితో ఎప్పుడూ సఖ్యంగానే ఉంటున్నాడు. సందర్భానుసారం బాబాయి గురించి మాట్లాడుతుంటాడు. ప్రశంసలు కురిపిస్తుంటాడు. బాలయ్య పుట్టిన రోజైనా.. ఆయన సినిమాలకు సంబంధించి ఏదైనా విశేషం బయటికి వచ్చినా కళ్యాణ్ రామ్ పాజిటవ్ గా స్పందిస్తుంటాడు. బాలయ్యకు కూడా కళ్యాణ్ రామ్ తో ఏ ఇబ్బందీ లేదని.. అతడితో తరచుగా బాగానే మాట్లాడుతుంటాడని అంటారు.

మరి బాబాయితో అంత మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్న కళ్యాణ్ రామ్.. సెప్టెంబరు 29న ‘పైసా వసూల్’ రిలీజవుతోందని తెలిసి కూడా వారం ముందుగా తన నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడం నందమూరి అభిమానుల్ని విస్మయానికి గురి చేసింది. పోయిన సంక్రాంతి మాదిరి కాకుండా ఈసారి రెండు సినిమాల మధ్య గ్యాప్ కొంచెం ఎక్కువే ఉన్నప్పటికీ.. ఒకేసారి బాబాయి.. అబ్బాయి సినిమాలు థియేటర్లలో ఉండటం మాత్రం ఖాయం.
‘నాన్నకు ప్రేమతో’ సినిమా అంటే బయటి వాళ్లది. ఎన్టీఆర్ ఆ సినిమా విడుదల విషయంలో ఏం చేయలేకపోయాడని అనుకుందాం.

కానీ ఈసారి కళ్యాణ్ రామే స్వయంగా నిర్మిస్తున్న సినిమాను బాలయ్య మూవీ వచ్చే వారం ముందు విడుదల చేయాలనుకోవడమంటే కయ్యానికి కాలు దువ్వడమే. ఇది మంచి సంకేతాల్నివ్వదు. దీనిపై ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. బాలయ్య ఎలాగూ తగ్గే అవకాశం లేదు కాబట్టి కళ్యాణ్ రామే తగ్గి సినిమాను ప్రిపోన్ చేసుకునే అవకాశాల్ని కొట్టిపారేయలేం.