ట్యూబ్ లైట్.. ఫ్యూజ్ ఎగిరిపోయింది

ఏడాది ఏడాదికి బాక్సాఫీస్ లెక్కలు మారిపోతుంటాయి. బడ్జెట్లు పెరుగుతుంటాయి. బిజినెస్ పెరుగుతుంటుంది. అలాగే కలెక్షన్లలోనూ పెరుగుదల ఉంటుంది. కొన్నేళ్ల కిందట బాలీవుడ్లో వంద కోట్ల కలెక్షన్లను గొప్ప మైలురాయిలాగా చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రాంతీయ సినిమాలు సైతం వంద కోట్ల మార్కును అలవోకగా అందుకుంటున్నాయి.

బాలీవుడ్ సినిమాలు రెండు మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కును అందుకుంటున్నాయి. అందులోనూ సల్మాన్ ఖాన్ సినిమా వచ్చిందంటే టాక్ ఎలా ఉన్నా 300-400 కోట్ల మధ్య వసూళ్లు రావాల్సిందే. ఫస్ట్ వీకెండ్లో కలెక్షన్లు వంద కోట్లకు చేరువ కావాల్సిందే. గత కొన్నేళ్లుగా ఇదే ట్రెండు నడుస్తోంది.

కానీ సల్మాన్ కొత్త సినిమా ‘ట్యూబ్ లైట్’ మాత్రం అతడి గత సినిమాల ఊపును కొనసాగించలేకపోతోంది. మూడేళ్ల కిందట వచ్చిన ‘కిక్’ సినిమా ఫస్ట్ వీకెండ్ వసూళ్ల కంటే ‘ట్యూబ్ లైట్’కు తక్కువ వచ్చాయి. ఆరేళ్ల కిందటి ‘బాడీ గార్డ్’ వీకెండ్ వసూళ్లను కూడా ‘ట్యూబ్ లైట్’ దాటలేకపోయింది.

నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘బాడీ గార్డ్’ తొలి వారాంతంలో రూ.88.75 కోట్లు వసూలు చేయగా.. యావరేజ్ టాక్‌తో మొదలైన ‘కిక్’ కూడా రూ.83.83 కోట్లు వసూలు చేసింది. ఇక సూపర్ హిట్ టాక్‌తో మొదలైన భజరంగి భాయిజాన్, సుల్తాన్‌ సినిమాల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆ రెండు సినిమాలూ తొలి వారాంతంలో వరుసగా రూ.102.6 కోట్లు.. రూ.105.53 కోట్లు కొల్లగొట్టాయి. ‘ట్యూబ్ లైట్’కు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈద్ వీకెండ్లో వసూళ్ల పంట పండుతుందనే అనుకున్నారు. కానీ ఈ సినిమా అంచనాల్ని తలకిందులు చేస్తూ తొలి వారాంతంలో రూ.64.77 కోట్లే వసూలు చేసింది. దీన్ని బట్టే ‘ట్యూబ్ లైట్’ ఫ్యూజులు ఎలా ఎగిరిపోయాయో అర్థం చేసుకోవచ్చు.