ఆ సినిమాను బ‌య‌టికి తెమ్మంటూ క‌మ‌ల్ వేద‌న‌

విశ్వ‌రూపం.. భార‌తీయ సినిమాను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో  హాలీవుడ్ ప్ర‌మాణాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని స్థాయిలో ఈ సినిమాను తెర‌కెక్కించి ఔరా అనిపించాడు. నాలుగేళ్ల కింద‌ట విడుద‌లైన ఈ చిత్రం అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌న‌మే అయింది. దీనికి కొన‌సాగింపుగా అదే ఏడాది రెండో భాగం తీసుకురానున్న‌ట్లు క‌మ‌ల్ ప్ర‌క‌టించ‌డంతో అంద‌రూ ఆస‌క్తిగా దాని కోసం ఎదురు చూశారు.

కానీ ఆ ఎదురుచూపుల‌తోనే నాలుగేళ్లు గ‌డిచిపోయాయి. సినిమా షూటింగ్ పూర్త‌యి చాలా కాల‌మైనా.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌గ్గ‌ర బ్రేక్ ప‌డ‌టంతో ఈ సినిమా ఆగిపోయింది.  నిర్మాత ఆస్కార్ ర‌విచంద్ర‌న్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవ‌డమే దీనికి కార‌ణం.

ఈ సినిమాను బ‌య‌టికి తెద్దామ‌ని విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్న క‌మ‌ల్ హాస‌న్.. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో దీనిపై స్పందించాడు. అవ‌స‌రమైతే త‌న పారితోష‌కం మొత్తం త్యాగం చేస్తాన‌ని.. సినిమాను విడుద‌ల చేసే ప్ర‌య‌త్నం చేయాల‌ని ర‌విచంద్ర‌న్ ను కోరాడు క‌మ‌ల్. విశ్వ‌రూపం-2 షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పెండింగ్‌లో ఉన్నాయి. అందుకు ఆరు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. ర‌విచంద్ర‌న్ డ‌బ్బులిస్తే ఆ ప‌ని వెంట‌నే మొద‌లుపెడ‌తాం.

నేను నా టీంకు రెమ్యూన‌రేష‌న్స్ ఇవ్వాలి. నాకు ఏమీ డ‌బ్బులివ్వ‌క‌పోయినా ప‌ర్వాలేదు. కానీ మిగ‌తా వాళ్ల‌కు డ‌బ్బులివ్వాలి. ఇది సినిమా. కూర‌గాయ‌ల దుకాణం కాదు. నా సినిమాను బ‌య‌టికి తేవ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తున్నా అని క‌మ‌ల్ తెలిపాడు.