పవన్‌కళ్యాణ్‌ని రీప్లేస్‌ చేస్తోన్న చిరంజీవి

‘కాటమరాయుడు’ వసూళ్లు గణనీయంగా పడిపోవడంతో సైడ్‌ థియేటర్లని తగ్గించడానికే బయ్యర్లు మొగ్గు చూపుతున్నారు. ఉగాది సెలవుని క్యాష్‌ చేసుకుందామని అనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారీ స్థాయిలో లాభం ఏమీ వుండదని, థియేటర్లు తగ్గిస్తే షేర్లు బెటర్‌ అవుతాయని నిర్ణయించుకున్నారు.

అందుకే చాలా సెంటర్లలో సోమవారం తర్వాత కాటమరాయుడు సైడ్‌ థియేటర్లని తగ్గించేసి చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ని రీరిలీజ్‌ చేసారు. కొన్ని చోట్ల నేను లోకల్‌, శతమానం భవతి చిత్రాలని తిరిగి విడుదల చేసారు. కనీసం రెండు వారాల పాటయినా పవన్‌కళ్యాణ్‌ పరంపర కొనసాగుతుందని ఆశించిన బయ్యర్లకి ‘కాటమరాయుడు’తో చేదు అనుభవమే ఎదురయింది. అంచనాలు తల్లకిందులు అయ్యేసరికి వారం తిరగకుండా బుక్‌ చేసుకున్న థియేటర్లని వదిలేసుకున్నారు.

ఉగాది రోజున కనీసం అయిదారు కోట్ల షేర్‌ తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుందని బయ్యర్లు ఆశిస్తున్నారు కానీ ఇప్పుడున్న ట్రెండ్‌ని బట్టి అది జరిగితే అద్భుతమేనంటున్నారు. గురు, రోగ్‌ చిత్రాలు రిలీజ్‌ అయితే వచ్చే వారాంతం కూడా అంతగా అనుకూలించకపోవచ్చునని భయపడుతున్నారు. ఇంకా రికవర్‌ కావాల్సిన డబ్బు చాలానే వుండడంతో ప్రస్తుతం పెట్టుబడిదార్లకి స్లీప్‌లెస్‌ నైట్స్‌ ఇస్తున్నాడు కాటమరాయుడు.