హే భగవాన్.. దేవుడి పైనే సెటైర్?

దేవుళ్ల గురించి రామ్ గోపాల్ వర్మ చేసే వెటకారాలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా హిందూ పండగలు ఏవి వచ్చినా దేవుళ్ల మీద సెటైర్లు వేయడానికి మంచి అవకాశంగా భావిస్తాడు వర్మ. దేవుడిని నమ్మడం వల్ల నష్టాలే తప్ప లాభాలేమీ లేవు అన్నట్లుగా ఉంటుంది ఆయన మాటతీరు. వర్మతో సాంగత్యం వల్ల ఆ ప్రభావం అతడి శిష్యుడు పూరి జగన్నాథ్ మీద కూడా పడ్డట్లే ఉంది. ఆయన భక్తి నేపథ్యంలో ఓ సెటైరికల్ సినిమా తీయడానికి రెడీ అవుతుండటమే దీనికి రుజువు. ఆయన తీయబోతున్న ఆ సెటైరికల్ మూవీ పేరు.. హే భగవాన్. ఈ సినిమాలో ఎవరు నటిస్తారన్నది మాత్రం చెప్పలేదు పూరి.

దేవుడి మీద నమ్మకం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీద ఈ సినిమా ఉంటుందని పూరి చెప్పడం విశేషం. అంటే ఇది వర్మ ఐడియాలజీ ఆధారంగా తీస్తున్న సినిమా ఏమో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పూరి ఇంతకుముందు దేవుడి నేపథ్యంలో సాగే కథతో ‘దేవుడు చేసిన మనుషులు’ అనే డిజాస్టర్ మూవీ ఒకటి తీశాడు. ఐతే పూరి చెబుతున్న ‘హే భగవాన్’.. పవన్-వెంకీల ‘గోపాల గోపాల’ తరహాలో సాగొచ్చని తెలుస్తోంది. ఐతే ఇలాంటి సినిమాలు తీసేటపుడు కొంచెం భక్తుల మనోభావాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. హిందువులు ఎంతైనా ఉదార స్వభావులు కాబట్టి వర్మ ఎలాంటి సెటైర్లయినా వేస్తాడు. పూరి ఎలాంటి సినిమా అయినా తీసేస్తాడు. వీళ్లెవ్వరూ కూడా వేరే మతాల దేవుళ్ల జోలికి మాత్రం వెళ్లరు.