ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి ఆయన తనయుడు, గాయకుడు కాలభైరవ మరోసారి ప్లాస్మా దానం చేశారు. కొన్నిరోజుల క్రితం దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, కీరవాణి సహా కొందరు కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. అయితే వీరందరూ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే కరోనా సోకిన రోజే తాము ప్లాస్మా దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం.. కీరవాణి, కాలభైరవ కరోనా వారియర్స్‌గా మారి ప్లాస్మాను దానం చేశారు.
తాజాగా ఇప్పుడు రెండోసారి కీరవాణి, కాలభైరవ ప్లాస్మాను దానం చేశారు. ఈ విషయాన్ని కీరవాణి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మా రక్తంలో యాంటీ బాడీస్ ఇప్పటికీ చురుకుగా ఉన్నట్లు తెలిసి.. నేను, నా కొడుకు కిమ్స్ ఆస్పత్రిలో రెండవసారి ప్లాస్మాను దానం చేశాము. ఒకటి కంటే ఎక్కువసార్లు ప్లాస్మా దానం చేయడానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’. అని చెబుతూ ప్లాస్మాను దానం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం కీరవాణి రెండు సినిమాలకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.