రోజుకొకటి చొప్పున హడావుడి చేస్తున్న ఖైదీ

తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న మెగాస్టార్.. తన సినిమా విడుదల సందర్భంగా తీసుకుంటున్న జాగ్రత్తలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ సినిమా అనౌన్స్ మెంట్ మొదలు.. ఇప్పటివరకూ క్రమపద్ధతిలో ఈ సినిమాకు ఎంత క్రేజ్ పెంచాలో అంత పెంచారు. విడుదల రోజుల్లోకి వచ్చేసిన వేళ.. ఈ సినిమా మీద అంచనాల్ని రోజువారీగా పెంచే పనిలో చిరు టీం ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఖైదీ సినిమా పాటల్ని ఆన్ లైన్ లో విడుదల చేశారు. వ్యూహాత్మకంగా ఒకటి తర్వాత ఒకటిగా ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు విడుదల చేస్తూ.. మరింత క్రేజ్ పెంచే ధోరణిలో మెగా క్యాంప్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న నీరు.. నీరు అంటూ రైతుల మీద పాటను విడుదల చేశారు. దాని ఆదరణపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ కార్యక్రమంపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ఏపీ సర్కారు అనుమతి ఇవ్వలేదని.. ఆ తర్వాత ఇచ్చారన్న వార్తలు మీడియాలో భారీగా దర్శనమివ్వగా.. ఫంక్షన్ కు డేట్ కన్ఫర్మ్ అయ్యాక.. దీనికి చిరు సోదరుడు పవన్ వస్తాడా? రాడా? అన్నది ఒక ప్రశ్నగా మారి.. వార్తల జోరు పెరిగింది. దీనిపై చర్చ ఒకపక్క సాగుతున్నవేళ.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

సినిమా విడుదలకు ఇంకా ఆరు రోజులు మాత్రమే టైం ఉన్నవేళ.. మరెన్ని వీడియోలు..కాన్సెప్ట్ లు విడుదల అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.భారీ ఎత్తున సాగుతున్న ప్రచారం మోతాదు మించుతుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను రోజురోజుకీ పెంచే ఈ ప్రయత్నం చివరకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.