మెగా పంచ్: అయిదు రోజుల్లో బ్రేక్ ఈవెన్

పదేళ్ల తర్వాత తిరిగి వస్తున్న చిరంజీవిని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలియని టైమ్లో కోట్లకి కోట్లు పెట్టుబడి పెట్టి రైట్స్ తీసుకుంటూ వుంటే, ‘ఈ బయ్యర్లకి మతి కానీ పోయిందా?’ అన్నట్టు చూసారు. ఈ పిచ్చితనం వల్ల నష్టపోతారంటూ ట్రేడ్ పండితులు సైతం హెచ్చరించారు.

అయితే మెగాస్టార్ స్టామినా ఏంటనేది అంచనా వేయడం ట్రేడ్ వల్ల కాలేదన్నది ‘ఖైదీ నంబర్ 150’ క్లియర్గా చూపిస్తోంది. ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్ అయితే గొప్పే అనుకున్న ఈస్ట్ గోదావరి ఏరియాలో కేవలం అయిదు రోజుల్లో బయ్యర్ బ్రేక్ ఈవెన్ అయిపోయాడు. అయిదు రోజుల్లో అయిదు కోట్ల ముప్పయ్ ఆరు లక్షల షేర్ సాధించిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్ని ఆల్రెడీ లాభాల బాట పట్టించింది.

ఆరవ రోజున కూడా అద్భుతమైన షేర్ వస్తుందని కలెక్షన్స్ ట్రెండ్ చెప్తోంది. ఇప్పట్నుంచీ సడన్గా డ్రాప్ అయిపోయినా కానీ కనీసం రెండు కోట్ల లాభం చూడకుండా ఉండరని, ఈస్ట్ గోదావరితో పాటు కృష్ణా, వెస్ట్, గుంటూరు జిల్లాల్లోను వచ్చే నాలుగైదు రోజుల్లో బయ్యర్లంతా సేఫ్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి.

జాతరని తలపించేలా వచ్చి పోతున్న జనవాహినిని చూసి ఈ చిత్రాన్ని ఎక్కువ అంచనా వేసిన వారు సైతం ఈ స్థాయి సంచలనాన్ని మాత్రం ఊహించలేదని అంగీకరిస్తున్నారు. చాలా ఏరియాల్లో తొలి వారం రికార్డులని అధిగమించిన ఖైదీ సినీ రంగంలో చిరంజీవి ఆధిపత్యం ఎలాంటిదనేది ఒక స్పష్టమైన అవగాహననిస్తోంది.