సొంతంగా రిలీజ్ చేసిన సినిమాకి నష్టాలు ఎలా కొరటాలా..?

‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ”భరత్ అనే నేను”. 2018 సమ్మర్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా థియేట్రికల్ షేర్ రాబట్టింది.

‘భరత్ అనే నేను’ సినిమా ఒక్క నైజాం ఏరియాలో 22 కోట్ల వరకు వసూలు చేసినట్లు ట్రేడ్ నివేదికలు తెలిపాయి. అయితే ప్రాంతంలో తన చిత్రానికి నష్టం వచ్చిందని కొరటాల శివ చెబుతున్నారు. ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకుడు.. ఈ మేరకు స్పందించారు.

తెలుగు చిత్రాలకు నైజాం అతిపెద్ద మార్కెట్ గా పరిగణించబడుతుంది. సినిమాల థియేట్రికల్ రైట్స్ ఈ ఏరియాలోనే ఎక్కువ ధరలకు అమ్ముడవుతాయి. ‘భరత్ అనే నేను’ సినిమాకు కొరటాల శివ రెమ్యునరేషన్ తీసుకోకుండా.. నైజాం హక్కులను తీసుకున్నారు.

నైజాంలో ఎక్కువ భాగం థియేటర్లు కలిగిన డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ద్వారా కొరటాల శివ సొంతంగా ‘భరత్ అనే..’ సినిమాని విడుదల చేసారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వల్ల తాను నైజాంలో నష్టపోయినట్లు దర్శకుడు చెబుతున్నారు.

సొంతంగా రిలీజ్ చేసుకున్న సినిమా.. అది కూడా 20 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టిన మూవీ ఎలా నష్టాలు మిగిల్చిందనేది ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘భరత్ అనే నేను’ సినిమా విడుదల టైంలో కొరటాల కు దిల్ రాజుకు మధ్య ఏదో వివాదం చెలరేగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కొరటాల ఈ వివాదం పై తాజాగా స్పందించారు. అది చాలా చిన్న ఇష్యూ అని.. అకౌంట్స్ కు సంబంధించినదని.. ఒక గంట కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకున్నామని ‘భరత్ అనే నేను’ డైరెక్టర్ తెలిపారు. దీనిని బట్టి ఇరువురి మధ్య లెక్కల్లో తేడా వచ్చి ఉంటుందని.. అందుకే కలెక్షన్స్ రాలేదని కొరటాల భావిస్తున్నారని మహేశ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కు నైజాంలో థియేటర్ల సమస్య వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను భారీ రేటుకి కొనుగోలు చేశారు. అయితే ఈ చిత్రానికి మెయిన్ థియేటర్లు లభించకుండా దిల్ రాజు చాలా వరకు బ్లాక్ చేస్తున్నారట.

ఇటీవల RRR – కేజీఎఫ్ 2 చిత్రాలని దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పటికే చాలా వరకు థియేటర్లలో ఈ రెండు చిత్రాలే ప్రదర్శింపబడుతున్నాయి. ఒకటి నెల రోజులు.. మరొకటి రెండు వారాలు దాటినా ‘ఆచార్య’ కు ప్రధాన థియేటర్లు ఇవ్వడానికి సుముఖంగా లేరట.

గతంలో ‘క్రాక్’ సినిమా రిలీజ్ టైంలో వరంగల్ శ్రీను – దిల్ రాజుల మధ్య వివాదం తలెత్తిందనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా విషయంలో ఎలా ఉంటుందో అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.