ఇదిగో అదిగో అంటున్నారు కానీ.

నక్షత్రం.. ఈ పేరు చెబితే కృష్ణవంశీ అభిమానుల్లో ఒక రకమైన అసహనం వచ్చేస్తోంది. మళ్లీ కృష్ణవంశీ అంటే ఏంటో చూపిస్తుందని ఆశించిన ఈ సినిమా.. అసలు థియేటర్లలోకి దిగడమే సందేహంగా మారింది. ఎప్పుడో ఏడాదిన్నర కిందట మొదలైన ఈ చిత్రం విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది.

ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. సినిమా మాత్రం బయటికి రావట్లేదు. ఓ దశలో పూర్తిగా వార్తల్లో లేకుండా పోయిన ఈ సినిమాను రెండు నెలల కిందట మీడియాలో హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రెస్ మీట్ పెట్టి టీజర్ రిలీజ్ చేసి.. మేలో రిలీజ్ అంటూ హడావుడి చేశారు. ఐతే మే వచ్చింది, వెళ్లింది.. జూన్ కూడా సగం దాటిపోయింది. సినిమా ఈ నెలలో కూడా విడుదలయ్యే సూచనలేమీ కనిపించట్లేదు. ఐతే ఇప్పుడు ‘నక్షత్రం’ మేకర్స్ నుంచి వినిపిస్తున్న కొత్త అప్ డేడ్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేస్తారట.

‘నక్షత్రం’ సినిమా ఏమైందసలు అంటూ మీడియాలో ఒక వార్త రాగానే.. ఇదిగో వచ్చేస్తున్నాం అని అప్ డేట్ ఇవ్వడం చిత్ర నిర్మాతలకు అలవాటైపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయని.. త్వరలోనే ఆడియో విడుదల చేస్తామని.. జులైలోనే సినిమా విడుదలవుతుందని మీడియాకు హింట్స్ ఇచ్చారు ‘నక్షత్రం’ మేకర్స్.

ఐతే ఈ సినిమాకు ఫైనాన్స్ సమస్యలు చాలా ఉన్నాయని.. బిజినెస్ అనుకున్న ప్రకారం జరగట్లేదని.. అందుకే విడుదల ఆలస్యమవుతోందని ఓ ప్రచారం నడుస్తోంది. మరి ఇప్పుడంటున్న ప్రకారం జులైలో అయినా ‘నక్షత్రం’ సినిమాకు మోక్షం కలుగుతుందేమో చూడాలి.