అర్థ‌రాత్రి 1.28 గంట‌ల‌కు కేటీఆర్ పెట్టిన ట్వీట్ ఇదే

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు క‌మ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదివారం అర్థ‌రాత్రి 1.28 గంట‌ల వేళ‌లో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ఓవైపు భారీ వ‌ర్షం న‌గ‌రాన్ని వ‌ణికిస్తున్న వేళ‌.. కేటీఆర్ పెట్టిన ట్వీట్ కంటెంట్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.. స‌ర్ ప్రైజ్ చేసేలా ఉండ‌టం విశేషం.

ఓవైపు వ‌ర్షం కార‌ణంగా న‌గ‌రంలో చోటు చేసుకుంటున్న ఇబ్బందుల‌పైనా.. అందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల మీదా వ‌రుస ట్వీట్లు చేస్తూనే.. ఇంకోవైపు ఇటీవ‌ల విడుద‌లైన అర్జున్ రెడ్డి చిత్రం మీద ట్వీట్ చేయ‌టం గ‌మ‌నార్హం.  వివాదాల‌తో మొద‌లై అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అర్జున్ రెడ్డి.. విడుద‌ల నాటి నుంచి భారీ వ‌సూళ్ల దిశ‌గా దూసుకెళుతోంది. ఈ చిత్రంపై మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు.

ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌.. న‌టి స‌మంత‌ల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంసిస్తున్న అర్జున్ రెడ్డి చిత్రంపై మంత్రి కేటీఆర్ ఫిదా అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ చిత్ర హీరోను. . “విజ‌య్ దేవ‌ర‌కొండ నువ్వు రాక్ స్టార్” అంటూ ప్ర‌త్యేకంగా అభినందించారు.  కేటీఆర్ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి.. నిర్మాత ప్ర‌ణ‌య్ భాస్క‌ర్ ల‌ను ప్ర‌శంసించారు.

“తీవ్ర‌మైన‌.. ముడి.. నిజాయితీ.. ఒరిజిన‌ల్‌.. తీవ్ర‌మైన‌.. సాహ‌సోపేతమైన‌..” అంటూ అర్జున్ రెడ్డి సినిమాను పొగిడేసే ప్ర‌య‌త్నం చేశారు. కేటీఆర్ ట్వీట్ చూస్తుంటే.. బాగా పొద్దుపోయిన త‌ర్వాత ఈ చిత్రాన్ని చూశార‌న్న భావ‌న క‌లుగుతోంది. బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా సినిమాకు ప్ర‌త్యేకంగా స‌మ‌యాన్ని కేటాయించ‌టం ఒక ఎత్తు అయితే.. అర్థ‌రాత్రి వేళ సినిమాను అభినందిస్తూ ట్వీట్ చేయ‌టం విశేషంగా చెప్ప‌క త‌ప్ప‌దు.