మంచు విష్ణు నిజంగా లక్కున్నోడే..

తన కొత్త సినిమాకు ‘లక్కున్నోడు’ అనే టైటిల్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఇప్పుడు అతడి సినిమాకు కలిసొచ్చిన తీరు చూసి అతను నిజంగానే లక్కున్నోడు అని అంటున్నారంతా. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కావాల్సింది. ముందు ఆ రోజుకు బెర్తు బుక్ చేసింది కూడా వీళ్లే. ఐతే ఆ తర్వాత అనుకోకుండా నాని సినిమా ‘నేను లోకల్’ అదే తేదీకి ఫిక్సయింది. ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ పోటీ చాలదన్నట్లు ముందు వారం సూర్య సినిమా ‘ఎస్ 3’..తర్వాతి వారం నాగార్జున మూవీ ‘ఓం నమో వెంకటేశాయ’ నుంచి కూడా పోటీ ఉంది. వీటన్నంటి మధ్య విష్ణు సినిమా నలిగిపోయేదే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3న సినిమాను రిలీజ్ చేద్దామా వద్ద ఆలోచనలో ఉండగా ‘ఎస్-3’ వాయిదా అన్న వార్త బయటికి వచ్చింది.

ఆలస్యం చేస్తే ఇంకెవరైనా బెర్తు బుక్ చేసేస్తారేమో అని.. సూర్య సినిమా వాయిదా వార్త బయటికి వచ్చిన కొన్ని గంటల్లోనే జనవరి 26న తమ సినిమా రిలీజ్ అని ప్రకటించేసింది ‘లక్కున్నోడు’ చిత్ర బృందం. సినిమా ఫస్ట్ కాపీతో రెడీగా ఉండటం.. మంచు విష్ణుకు థియేటర్ల యాజమాన్యాలతోనూ మంచి సంబంధాలుడటంతో తక్కువ సమయంలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టేశారు. సంక్రాంతి సినిమాల జోరు ఆల్రెడీ తగ్గిపోయిన నేపథ్యంలో రిపబ్లిక్ డే నాడు సోలోగా రిలీజవుతున్న ‘లక్కున్నోడు’కు బాగానే కలిసొచ్చే అవకాశముంది. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీ కూడా ఉంది. మొత్తానికి ‘లక్కున్నోడు’ సినిమాకు లక్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.