రాజమౌళికి ‘శ్రీవల్లీ’ కథ నచ్చలేదట

ఆడియో వేడుకలు అనగానే ఒకరినొకరు పొగుడుకోవడమే చూస్తున్నాం. తమ సినిమా గురించి సినిమా రూపకర్తలు ఏ స్థాయిలో డబ్బా కొట్టుకుంటారో తెలిసిందే. ఐతే ‘శ్రీవల్లీ’ ఆడియో వేడుకలో మాత్రం దీనికి భిన్నమైన దృశ్యం కనిపించింది. తన తండ్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి రాజమౌళి చాలా ఆచితూచి మాట్లాడాడు. ఎక్కడా కూడా సినిమా గురించి గొప్పలు చెప్పలేదు. అసలు తన తండ్రి ఈ కథ ముందుగా తనకు చెప్పినపుడు తనకు నచ్చలేదంటూ మొహమాటం లేకుండా చెప్పినట్లు రాజమౌళి వెల్లడించాడు. ఐతే తన తండ్రి మాత్రం తనకు ఈ కథపై నమ్మకం ఉందంటూ ముందుకెళ్లిపోయారని రాజమౌళి తెలిపాడు.

ఆ తర్వాత ‘శ్రీవల్లీ’ గురించి తామిద్దరం డిస్కస్ చేయలేదని.. తనకు సినిమాలో ఒక్క షాట్ కూడా చూపించలేదని… ఆడియో వేడుకకు పిలిచాక తనకు మళ్లీ కథ చెప్పారని.. మార్పులు చేశాక ఆ కథ అద్భుతంగా అనిపించిందని.. ఐతే ఈ కథను సరిగ్గా తెరకెక్కించడానికి ఎంతో డైరెక్టోరియల్ స్కిల్స్ కావాలని రాజమౌళి అభిప్రాయపడ్డాడు. తన తండ్రి ఆ స్కిల్ చూపించి ఉంటాడని ఆశిస్తున్నానని అన్నాడు. తన సినిమాలో చిన్న చిన్న విషయాల్లో తన తండ్రి తప్పులు వెతుకుతుంటాడని.. తాను కూడా ఆయన సినిమాలో తప్పులు వెతకడానికి అలాగే ఎదురుచూస్తున్నానని రాజమౌళి అన్నాడు. అనంతరం విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. తన కొడుకు ఉన్న స్థాయికి ‘శ్రీవల్లీ’ గురించి అతడితో గొప్పగా మాట్లాడించి సినిమాను భారీ రేట్లకు అమ్మేసుకోవచ్చని.. అలాంటి కుసంస్కారం తమకు లేదని వ్యాఖ్యానించాడు. తాను కూడా తన సినిమా గురించి గొప్పలు చెప్పనని.. ఒక వినూత్నమైన.. ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచే కథతో ఈ సినిమా తీశానని మాత్రం చెప్పగలనని ఆయన అన్నారు.