తప్పదంటేనే అమెరికాకు వెళ్లమంటున్నారు

ప్రపంచంలో ఎక్కడైనా.. ఏదైనా అనుకోని ఘటన జరిగిన వెంటనే.. అమెరికా ప్రభుత్వం రియాక్ట్ అయ్యేది. సదరు దేశానికి తమ దేశ పౌరుల్ని వెళ్లొద్దంటూ సూచనలు చేసేది. ఆ దేశానికి వెళ్లటం ప్రమాదకరమని.. సదరు దేశానికి జర్నీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని చెప్పేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్లే విషయంలోఆచితూచి వ్యవహరించాలని.. మరీ అవసరమైతే తప్పించి ఆ దేశానికి వెళ్లే ప్రోగ్రాంను పోస్ట్ పోన్ చేసుకొమ్మని చెప్పే దేశాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో మారిన పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే పలు యూరప్ దేశాలు తమ దేశీయుల్ని అమెరికాకు వెళ్లే పోగ్రాంను పోస్ట్ పోన్ చేసుకోవటమో.. మరోసారి ఆలోచించుకోవాలని కోరుతున్నాయి. అమెరికాలోపరిస్థితి బాగోలేదని.. ఇప్పుడున్న పరిస్థితుల్లోఆ దేశానికి వెళ్లకపోవటమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. యూరోప్ దేశాలకు చెందిన వారిలో దాదాపు 30 శాతానికి పైగా టూరిస్టులు అమెరికాను విజిట్ చేద్దామనే ఆలోచనను వాయిదా వేసుకున్నట్లుగా చెబుతున్నారు. యూరోప్ దేశాలే కాదు.. ప్రపంచంలోని పలుదేశాలు ఇదే సూచనను చూస్తుండటం గమనార్హం.

భారత్ లోనూఇప్పుడిప్పుడే ఈ భావన పెరుగుతోందని.. తాజా పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నట్లుగా ట్రావెల్ కంపెనీలు చెబుతున్నారు. దాదాపు మూడు నెలల ముందే అమెరికా ప్రయాణానికి టికెట్లు కొనుగోలుచేసిన నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు అమెరికాకు వెళ్లే ప్రయాణాల మీద ప్రభావం ఉన్నట్లుగా కనిపించదుకానీ.. రానున్న రోజుల్లో ఇది చాలా స్పష్టంగా కనిపించనుందన్న మాటను వారు చెబుతున్నారు.తాజా పరిణామాల నేపథ్యంలో.. టూరిస్టుల కారణంగా వచ్చే రూ.1400 కోట్లకు పైనే (సుమారు) ఆదాయాన్ని అమెరికా నష్టపోయిందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. అమెరికాతీసుకొస్తున్న కొత్త వీసా విధానంపై నైజీరియా సైతంరియాక్ట్ అయ్యింది. మరీ అత్యవసరం అనిపిస్తే తప్పించి..అమెరికాకు వెళ్లే ఆలోచనను మానుకోవాలి తన దేశీయులకు సూచిస్తోంది. వలసదారులకు సంబంధించి తీసుకొస్తున్న మార్పులు.. రూల్స్ పై మరింత స్పష్టత వచ్చే వరకూ యూఎస్ ట్రిప్ ను పోస్ట్ పోన్ చేసుకోవాలని తన దేశీయుల్ని కోరుతోంది. చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్నప్పటికి పలువురు నైజీరియన్లను అమెరికన్ అధికారులు తిప్పి పంపిస్తున్న వైనంపై ఆ దేశం స్పందించి.. తాజా ప్రకటనను చేసింది. ట్రంప్ పుణ్యమా అని.. రానున్న రోజుల్లో అమెరికా పరిస్థితి ఇంకెంతలా మారుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.