సినిమా నచ్చలేదా.. క్షమించమంటున్న హీరో

ఒక సినిమాకు టాక్ బాగున్నా.. బాలేకున్నా.. దాని గురించి పాజిటివ్‌గానే మాట్లాడతారు హీరోలు. ప్రమోషన్ వేడుకల్లో సినిమా నచ్చకపోవడం గురించి అస్సలు ప్రస్తావించరు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతారే తప్ప.. నచ్చలేదని అన్న వాళ్లకు సారీ చెప్పరు. ఐతే యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ మాత్రం ఇలాగే భిన్నంగా స్పందించాడు. తన కొత్త సినిమా ‘ద్వారక’ నచ్చని వాళ్లకు అతను క్షమాపణలు చెప్పాడు. ద్వారక’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా విజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘‘నేను.. నా టీం ఈ కథను నమ్మి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. నేను ఒక పది సినిమాలు చేశాక నా వికీపీడియా పేజీ ఓపెన్ చేసుకుని చూస్తే.. ఆ పది సినిమాలు వేటికవే భిన్నంగా ఉండాలన్నది నా కోరిక. అందుకే అన్ని జానర్లలో సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన సినిమా.. ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు, ద్వారక. ఈ మూడూ వేటికవే భిన్నంగా ఉంటాయి.  ద్వారక సినిమా చాలామందికి నచ్చింది. అలాగే కొంతమందికి నచ్చలేదు కూడా. వారికి క్షమాపణ చెబుతున్నాను. తప్పకుండా అందరికీ నచ్చే సినిమాలు చేస్తాను’’ అని విజయ్ దేవరకొండ అన్నాడు.

‘ద్వారక’ సినిమా బాగా ఆడుతోందని.. దాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్ కార్యక్రమాలు మరిన్ని చేస్తామని విజయ్ అన్నాడు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర రూపొందించిన ‘ద్వారక’లో విజయ్ దేవరకొండ దొంగ నుంచి బాబాలా మారే పాత్ర పోషించాడు. అతడి సరసన పూజా జవేరి కథానాయికగా నటించింది.