ఎన్నారైల హ‌త్య‌లంటే లైట్ తీసుకుంటున్న మోడీ!

అగ్ర‌రాజ్యం అమెరికాలో ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు వెతుక్కుంటూ వెళ్లిన భార‌తీయులు జాత్యహంకార శ్వేత‌జాతీయుల చేతుల్లో హ‌త్య‌కు గురువుతున్నా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ లైట్ తీసుకోవ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో ఉన్న వారు బిక్కుబిక్కుమ‌ని గ‌డిపే ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ మోడీ స్పందించ‌డం లేద‌ని ఇన్నాళ్లు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగ‌గా, ఇపుడు ఏకంగా పార్ల‌మెంటులో అదే విమ‌ర్శ‌లు వినిపించాయి. కేంద్ర బ‌డ్జెట్ పార్ల‌మెంట్ పునఃస‌మావేశాల నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాలు మోడీ తీరుపై మండిప‌డ్డాయి.

కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌, ఎంపీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే అమెరికాలో శ్వేత‌జాతీయుడి చేతిలో హ‌త్య‌కు గురైన కూచిభొట్ల శ్రీ‌నివాస్ విష‌యాన్ని స‌భ‌లో లేవెనెత్తారు. అమెరికా అధ్య‌క్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అధికారాలు చేపట్టిన త‌ర్వాత‌నే ఆ దేశంలో ఇలాంటి దాడులు పెరిగాయ‌ని ఖ‌ర్గే ఆరోపించారు. అమెరికాలో భార‌తీయుల‌పై జ‌రుగుతున్న దాడులను అడ్డుకునేందుకు భార‌త్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను వెల్ల‌డించాల‌ని ఖ‌ర్గే డిమాండ్ చేశారు. కూచిభొట్లపై జాతివివ‌క్ష దాడి జ‌రిగింద‌ని, దానిపై ప్ర‌ధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌తి అంశాల్లో ట్వీట్లు చేసే ప్ర‌ధాని ఈ ఘ‌ట‌న‌పై ఎందుకు ట్వీట్ చేయ‌లేద‌ని ఖ‌ర్గే నిల‌దీశారు. ఎన్నారైల హ‌త్య‌లంటే మోడీ లైట్ తీసుకుంటున్నారా అని ప్ర‌శ్నించారు.

ఇదే అంశంపై మిగ‌తా పక్షాలు సైతం మోడీ తీరును త‌ప్పుప‌ట్టాయి. టీఆర్ఎస్ ఎంపీ, ఆ పార్టీ ఫ్లోర్ లీడ‌ర్‌ జితేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ మీ దేశానికి వెళ్లిపో అంటూ శ్రీ‌నివాస్‌పై శ్వేత‌జాతీయుడు కాల్పులు జ‌రిపార‌ని  అన్నారు. గ‌తంలో అమెరికాలో ఎన్న‌డూ ఇలాంటి ఘ‌ట‌న‌లు చూడ‌లేద‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే డిమాండ్ చేసిన విధంగానే తాము కూడా కేంద్రం నుంచి కూచిబొట్ల హ‌త్య‌పై ప్ర‌క‌ట‌న ఆశిస్తున్నామ‌ని ఎంపీ జితేంద‌ర్ రెడ్డి తెలిపారు.అమెరికాలో భార‌తీయుల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నా కేంద్రం ఎందుకు స్పందించ‌డం లేద‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగ‌త్‌రాయ్ ప్ర‌శ్నించారు. అమెరికాలో జాతివివ‌క్ష దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం భార‌తీయుల‌కు ఏమైనా అడ్వైజ‌రీ జారీ చేస్తుందా అని ఒడిశా ఎంపీ భ‌ర్తృహ‌రి ప్ర‌శ్నించారు.  కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ భార‌తీయులకు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు అన్నిచ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తున్నామ‌న్నారు.