పూరికి అంత కాన్ఫిడెన్స్ ఏంటో?

పూరి జగన్నాథ్‌కు స్పీడ్ డైరెక్టర్ అని పేరుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో పూరి అంత స్పీడుగా సినిమాలు చేసే దర్శకులు ఇంకెవరూ కనిపించరు. చిన్న హీరోతో అయినా.. పెద్ద హీరోతో అయినా నాలుగైదు నెలల్లో సినిమాను పూర్తి చేయడం పూరికి మాత్రమే చెల్లు. కాకపోతే ఒకప్పుడు పూరి ఈ వేగంతో పాటు క్వాలిటీ కూడా చూపించేవాడు. ఇప్పుడు వేగం మాత్రమే ఉంటోంది.. క్వాలిటీ తగ్గిపోతోంది. అదే సమస్య.

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో మొదలైన సినిమాను కూడా ఐదు నెలల్లోపే పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు పూరి. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినపుడే సెప్టెంబరు 29న రిలీజ్ అని పూరి ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా పూరి మాట్లాడుతూ.. ఇప్పడు చెప్పిన రిలీజ్ డేట్ కంటే కూడా కొన్ని రోజుల ముందే సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తానని ప్రకటించాడు. ఓవైపు బాలయ్య సినిమా కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చాడు పూరి. దానికి స్పందనగా వందల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయట. వాటిని సార్ట్ ఔట్ చేసి.. నటీనటుల్ని ఎంపిక చేసి.. వాళ్లను ట్రైన్ చేసుకుని సినిమా కోసం రెడీగా పెట్టుకోవడానికి టైం పట్టే అవకాశముంది. ఈ ప్రక్రియను ముగించి అనుకున్న ప్రకారం సినిమాను పూర్తి చేసి.. చెప్పిన డేటుకు రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు.

పైగా పూరి గత సినిమాల్లో క్వాలిటీ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో ఈసారి కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. మరి పూరి ఎలా మేనేజ్ చేస్తాడో.. బాలయ్యను మెప్పించేలా సినిమా తీసి అనుకున్న డేటు కంటే ముందు ఎలా విడుదల చేస్తాడో చూడాలి.