మోదీ చేయ‌లేనిది లాక్‌డౌన్ చేసింది

నిజంగా పైసా ఖ‌ర్చు లేకుండా…ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ క‌ల నెర‌వేరింది. అది కూడా ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు విష‌యంలో ఊహించ‌ని విజ‌యం సొంత‌మైంది. ఇదంతా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గంగా న‌ది గురించి. గంగా నది పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యల‌తో న‌మామి గంగా ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ భారీ ప్రాజెక్టు చేయ‌లేనిది లాక్‌డౌన్ చేసింది. అదే గంగాన‌ది శుద్ధి చేయ‌డం.

లాక్‌డౌన్ ద్వారా గంగా న‌దిలో ఊహించ‌ని మార్పు వ‌చ్చింది. లాక్ డౌన్‌తో వారణాసి, హరిద్వార్ పరిసర ప్రాంతాలలోని పరిశ్రమల వ్యర్థాలు గంగా నదిలో కలవడం లేదు… దీంతో చాలా ఏళ్ల తర్వాత గంగా నది నీళ్లు స్వచ్చంగా మారాయి. మార్చ్ 24 ప్రధాని నరేంధ్ర మోడీ ఇచ్చిన లాక్ డౌన్ పిలుపు తర్వాత… కొన్ని రోజుల నుంచి గంగానదిలో మార్పు కనపడుతుందని స్థానికులు తెలిపారు.

పారిశ్రామిక వ్యర్థాలతో పాటు అక్కడి స్థానిక‌ వ్యాపారులు, హోటల్ల‌ నుంచి వచ్చే వ్యర్థాలు నదిలో కలవకపోవడం వలన ఈ మార్పు సంభవించిందని అన్నారు. శాస్త్రవేత్తలు గంగా నదిలోని నీటిని పరిశీలించి.. తాగడానికి వీలుగా గంగా నది నీళ్లు మారాయని.. దాదాపు 50శాతం శుద్ధి అయ్యాయని తెలిపారు. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకు పరిమితమవడంతో…ఈ మధ్య కురిసిన వర్షాల వలన గంగా నది నీళ్లు స్వచ్చంగా మారడానికి కారణమయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో పాటు యమునా నదిలో కూడా నీటి క్వాలిటి పెరిగిందని అన్నారు. నీటి అడుగు భాగంలోని చిన్న రాళ్లు కూడా కనపడేంత స్వచ్చంగా గంగానది నీళ్లు మారాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గంగానది వీడియోలు వైరల్ అవుతున్నాయి.