ఇస్మార్ట్ భామ తప్పు చేస్తోందా?

ఇస్మార్ట్ భామ నభ నటేష్ ఆ చిత్రంలో గ్లామర్ విందుతో అలరించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మరో హీరోయిన్ ఉన్నా కానీ గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం నభనే. ఈ సినిమాతో మళ్ళీ ఆమెకు అవకాశాలు పెరిగాయి. మీడియం బడ్జెట్ సినిమాలకు, యువ హీరోల సరసన నభ సరిగ్గా సరిపోతుంది కాబట్టి ఆమెను కన్సిడర్ చేసే ఫిల్మ్ మేకర్స్ పెరిగారు. ప్రస్తుతం సాయి తేజ్ సరసన సోలో బ్రతుకే సో బెటరు చిత్రం చేస్తోన్న నభ నటేష్ ఇప్పుడు నితిన్ సరసన హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి.

నితిన్ అంధధూన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెల్సిందే. మేర్లపాక గాంధీ దర్శకుడిగా ఎంపికయ్యాడు. సినిమా లాక్ డౌన్ కు ముందు ముహూర్తం జరుపుకుంది కూడా. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్ ఈ పాటికి మొదలయ్యేది. సెప్టెంబర్ లేదా ఇయర్ ఎండ్ కు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.

అయితే అంధధూన్ చిత్రంలో హీరోయిన్ కు పెద్ద స్కోప్ ఏం లేదు. హీరోతో ఒక రొమాంటిక్ సీన్ తప్ప ఆమె గురించి చెప్పుకోవడానికేం ఉండదు. సినిమా అంతా హీరో, టబు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మరి ఎందుకని నభ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందనేది అర్ధం కాని ప్రశ్న. ఈ ఏడాది విడుదలైన డిస్కో రాజాలో కూడా ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రను చేసింది ఈమె. ఆ సినిమా పరాజయం ఆమె కెరీర్ కు కొంచెం ఎఫెక్ట్ ఇచ్చిందనే చెప్పాలి. మరి తనకు ప్రాధాన్యత లేని సినిమాలను ఎంపిక చేసుకుని నభ ఏమైనా తప్పు చేస్తోందా?