వర్మ నాగ్‌ను కూడా ఫూల్ చేశాడే..

దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాలెన్ని ఉన్నాయో.. ఆయన అనౌన్స్ చేసి.. మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన సినిమాలు కూడా అన్ని ఉంటాయి. దర్శకుడిగా కెరీర్ ఆరంభంలోనే మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరోతో సినిమా మొదలుపెట్టి దాన్ని అర్ధంతరంగా వదిలేసి ఘనుడు వర్మ. ఇక గత దశాబ్ద కాలంలో రెండంకెల సంఖ్యలో వర్మ సినిమాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ‘రెడ్డిగారు పోయారు’ అని.. ‘శ్రీదేవి’ అని.. ‘రాయ్’ అని.. ‘శశికళ’ అని.. ఇలా చాలా సినిమాలు అనౌన్స్ చేసి ఆ తర్వాత వాటి సంగతి మరిచిపోయాడు వర్మ.

ఐతే వీటి విషయంలో జనాలకు అంత ఆశ్చర్యమేమీ లేదు కానీ.. గత ఏడాది ‘న్యూక్లియర్’ పేరుతో ఓ అంతర్జాతీయ సినిమాను అనౌన్స్ చేసినపుడే అందరూ షాకయ్యారు. ఓ అంతర్జాతీయ సంస్థ రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో వర్మ దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చినట్లు వార్తలొచ్చాయి.

ముందు ఇది జస్ట్ రూమర్ అనుకున్నప్పటికీ తర్వాత అక్కినేని నాగార్జున సైతం దీని గురించి ట్వీట్చేస్తూ వర్మకు అభినందనలు చెప్పడంతో ఈ సినిమా నిజంగానే కార్యరూపం దాల్చబోతోందనుకున్నారంతా. కానీ ఆ ఒక్క ప్రకటన తర్వాత ఈ సినిమా గురించి అప్ డేటే లేదు. వర్మ దాని ఊసే ఎత్తట్లేదు. ఈ సినిమాను నిర్మిస్తానన్న సంస్థ అడ్రస్ లేదు. ఇప్పుడు వర్మ ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్ మీద పడ్డాడు. ఎన్టీఆర్ బయోపిక్‌ను కూడా అనౌన్స్ చేశాడు. చూస్తుంటే ‘న్యూక్లియర్’ సినిమా ఒక తమాషా అన్న భావన కలుగుతోంది. చివరికి నాగార్జునను కూడా వర్మ ఫూల్ చేసేశాడే అని ఆయన ఫ్యాన్స్ తీరిగ్గా ఇప్పుడు బాధపడుతున్నారు.