హరీష్ శంకర్.. ఇక చాలించవయ్యా!

‘దువ్వాడ జగన్నాథం’ రిలీజైన మరుసటి రోజు నుంచి దర్శకుడు హరీష్ శంకర్ దూకుడు మామూలుగా లేదు. ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన సమీక్షకుల మీద హరీష్ ఎలా రెచ్చిపోయాడూ చూస్తూనే వస్తున్నాం. ట్విట్టర్లో మొదలైన అటాక్‌ను థ్యాంక్స్ మీట్లోనూ కొనసాగించాడు. ఆపై అమెరికా పర్యటనకు వెళ్లి అక్కడ కూడా వాయింపుడు ఆపలేదు.

తాజాగా ‘డీజే’ కలెక్షన్ల లెక్కలతో మరోసారి ట్విట్టర్లో తన దూకుడు చూపించాడు హరీష్. ఈ లెక్కల్లో తేడా ఉన్నట్లు నిరూపిస్తే.. సినిమాలే మానేస్తానంటూ సవాలు విసిరాడు. ఐతే రివ్యూలు, టాక్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు బాగున్నాయి కదా అని సంతోషించక.. ఇలా అదే పనిగా ఎదురు దాడి చేయడం ఏమిటంటూ హరీష్ మీద విమర్శలు గట్టిగానే విమర్శలు వినిపిస్తున్నాయి.

సినిమాలో కంటెంట్ గురించి విమర్శించండి.. కానీ వ్యక్తిగత విమర్శలు చేయొద్దని హరీష్ ఇంతకుముందు అన్నాడు. కానీ ప్రధాన పత్రికలు కానీ.. వెబ్ సైట్లు కానీ.. సినిమాలో కంటెంట్ గురించే విమర్శలు చేశాయి తప్ప.. హరీష్‌ను వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. ఎవరో ఒకరు అన్నారని అందరి మీదా పడిపోవడం ఏంటని ఇప్పటికే విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు కలెక్షన్ల విషయంలో ఎవరో ఏదో అంటే ఆ స్థాయిలో రెచ్చిపోవడం.. పెద్ద పెద్ద సవాళ్లు విసరడం ఏంటని హరీష్‌ను తప్పుపడుతున్నారు. హరీష్ తీరు మరీ శ్రుతి మించిందంటూ ఇటు హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి.. అటు దిల్ రాజు వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. హరీష్ ఇక చాలించు అంటూ రెండు వైపుల నుంచి హెచ్చరికలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. వాళ్లు అనడం కాదు కానీ.. మరీ ఈ స్థాయిలో దూకుడు చూపిస్తే తన కెరీర్‌కు అంత మంచిది కాదని హరీష్ ఎందుకు గుర్తించట్లేదో ఏంటో.