నా సినిమానే దొరికిందా? నాగార్జున గుస్సా!

‘సింగం 3’ చిత్రాన్ని ‘ఓం నమో వెంకటేశాయ’కి ఒక్క రోజు ముందు విడుదల చేస్తుండడం పట్ల నాగార్జున హ్యాపీగా లేరని పుకార్లు షికారు చేస్తున్నాయి. సంక్రాంతికే రావాల్సిన సినిమాని ఆ రష్‌లో రిలీజ్‌ చేయడం ఇష్టం లేక జనవరి 26న చేద్దామని అనుకున్నారు. అయితే సింగం 3, గురు చిత్రాలు ఆ డేట్‌ని ఎంచుకోవడంతో భక్తిరస చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాల మధ్య విడుదల చేయడం ఇష్టం లేక సేఫ్‌గా ఫిబ్రవరి 10న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు.

తీరా సింగం 3, గురు రెండూ కూడా జనవరి 26న విడుదల కాలేదు. అవి రెండూ వాయిదా పడడంతో అప్పటికప్పుడు ఓం నమో వెంకటేశాయని ముందుకి జరపలేకపోయారు. ఆ డేట్‌ వృధా అయిపోగా, ఇప్పుడు సింగం వచ్చి నాగార్జున చిత్రానికి పోటీగా విడుదలవుతోంది. సింగం పక్కా మాస్‌ చిత్రం కావడంతో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్‌ వెంకటేశాయపై తీవ్రంగా వుంటుంది.

అసలే సెలవులు లేని టైమ్‌లో విడుదల చేస్తోన్న చిత్రం కనుక పోటీలో ఎక్కువ వసూళ్లు తెచ్చుకునే అవకాశం వుండదు. నాగార్జున ‘సోగ్గాడే’ విజయాన్ని, అన్నమయ్య ఫ్యాక్టర్‌ని దృష్టిలో పెట్టుకుని ‘ఓం నమో వెంకటేశాయ’ భారీ రేట్లకి కొన్నారు. సింగం రావడం పట్ల బయ్యర్లు కూడా సంతోషంగా లేరని, వారు నాగార్జునని సంప్రదించారని సమాచారం. ఇప్పటికి విడుదల తేదీలో మార్పు లేకపోయినప్పటికీ తన సినిమాకి పోటీగా విడుదల చేయడం పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు భోగట్టా.