హ‌ర్షా ట‌యోటాపై వెంక‌య్య క్లారిటీ

ఎన్డీయే ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన కేంద్ర‌మంత్రి క‌మ్ బీజేపీ సీనియ‌ర్ నేత వెంక‌య్య‌నాయుడిపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. మాజీ కేంద్ర‌మంత్రి జైరాం ర‌మేష్ చేసిన తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వెంక‌య్య నాయుడు కుటుంబానికి చెందిన స్వ‌ర్ణ భార‌తి ట్ర‌స్టు.. హ‌ర్షా ట‌యోటాపై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. హైద‌రాబాద్ స‌మీపంలోని స్వ‌ర్ణ భార‌తి ట్ర‌స్టుకు తెలంగాణ ప్ర‌భుత్వం రూ.2 కోట్ల ప‌న్ను మిన‌హాయింపులు ఇస్తూ ర‌హ‌స్య జీవో జారీ చేసిందని ఆరోపించారు. అంతేకాదు..తెలంగాణ పోలీసుల‌కు అంద‌జేసిన ట‌యోటా ఇన్నోవా వాహ‌నాల మీదా విమ‌ర్శ‌లు చేశారు.

దీనిపై వెంక‌య్య‌నాయుడు రియాక్ట్ అయ్యారు. త‌న మీద జైరాం ర‌మేష్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై వెంక‌య్య‌నాయుడు కార్యాల‌యం తాజాగా రియాక్ట్ అయ్యింది. జైరాం ర‌మేష్ ఆరోప‌ణ‌ల్ని కొట్టి పారేస్తూ వివ‌ర‌ణ ఇచ్చింది. స్వ‌ర్ణ‌భార‌తి ట్ర‌స్టు లాభాపేక్ష‌తో కూడిన సంస్థ కాద‌న్న విష‌యాన్ని తెలంగాణ ప్ర‌భుత్వ‌మే స్ప‌ష్టం చేసింద‌ని పేర్కొంది. ట్ర‌స్టుకు ఎలాంటి అభివృద్ధి రాయితీలు ఇవ్వ‌లేద‌ని.. ట్ర‌స్టులో వృత్తి నైపుణ్య‌త‌.. ఆరోగ్య సేవ‌లు.. మ‌హిళా.. నిరుద్యోగుల‌కు ఉపాధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నందున వాటిని మ‌రింత ప్రోత్స‌హించేందుకు మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపులు ఇచ్చిన‌ట్లుగా క్లారిటీ ఇచ్చారు.

త‌మ కుటుంబ స‌భ్యులు చేసే వ్యాపారానికి తాను ఎప్పుడూ దూరంగా ఉంటాన‌ని వెంక‌య్య వెల్ల‌డించారు. టెండ‌ర్లు లేకుండా హ‌ర్షా ట‌యోటా డీల‌ర్‌కు స‌ప్లై ఆర్డ‌ర్ ఇచ్చార‌ని అన‌టం త‌ప్ప‌ని వెంక‌య్య స్ప‌ష్టం చేశారు. ట‌యోటా కంపెనీతో తెలంగాణ ప్ర‌భుత్వ‌మే నేరుగా ఒప్పందం చేసుకొని వామ‌నాల్ని స‌ర‌ఫ‌రా చేసింద‌న్నారు. ఆరోప‌ణ‌లు చేయ‌టంతో ఏం జ‌రిగిందో తెలుసుకొని తాను వాస్త‌వాల్ని వెల్ల‌డిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు.  రాజ‌కీయ దురుద్దేశంతోనే జైరాం ర‌మేష్ త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని వెంక‌య్య మండిప‌డ్డారు. జైరాం ఆరోప‌ణ‌ల్ని చూస్తే.. కాంగ్రెస్ పార్టీ నిస్స‌హాయ ప‌రిస్థితి.. రాజ‌కీయ అప‌రిప‌క్వ‌త తెలియ‌జేస్తోంద‌న్నారు.