ఆ హీరోల గొప్పేం లేదంటున్న నాని

సరదాగానే పెద్దోళ్లకు గట్టి పంచులే వేస్తున్నాడు నాని. దిల్ రాజు బేనర్లో వచ్చే సినిమాలకు సంబంధించి శిరీష్, లక్ష్మణ్, హర్షిత్‌ లాంటి వాళ్ల కష్టమే 90 శాతమని.. దిల్ రాజు కష్టం పది శాతమే అని.. కానీ బయట క్రెడిట్ మాత్రం దిల్ రాజు ఒక్కడే తీసుకుంటాడని అంటూ ‘నేను లోకల్’ ఆడియో వేడుకలో రాజును ఇరకాటంలో పెట్టేశాడు నాని. మరోవైపు టాలీవుడ్లో డ్యాన్సులు బాగా వేసే స్టార్ హీరోలకు కూడా నాని ఒక పంచ్ వేశాడు.

తెలుగులో చాలామంది హీరోలు డ్యాన్సులు బాగా వేస్తారని.. మరి తానెందుకు వాళ్లలా డ్యాన్స్ చేయలేకపోతున్నానని ఫీలయ్యే వాడని.. కానీ దేవిశ్రీ ప్రసాద్ పాటలకు డ్యాన్స్ చేశాక తన ఆలోచన మారిందని అన్నాడు నాని. దేవి పాట వినగానే ఆటోమేటిగ్గా బాడీలో ఊపు వచ్చేస్తుందని.. డ్యాన్స్ ఇరగదీసేస్తామని.. దేవిశ్రీతో పని చేసిన హీరోలందరూ కూడా ఇలాగే డ్యాన్సులేశారని.. వాళ్ల గొప్పేమీ లేదని తనకు అర్థమైందని నాని చెప్పాడు.

‘నేను లోకల్’ సినిమాలో తొలిసారిగా తాను డ్యాన్సులు కొంచెం గట్టిగా వేశానని.. అవి జనాలకు కచ్చితంగా నచ్చుతాయని భావిస్తున్నట్లు నాని చెప్పాడు. తన కెరీర్లో బెస్ట్ ఆల్బమ్స్‌లో ‘నేను లోకల్’ ఒకటని నాని చెప్పాడు. ఎప్పుడూ పెద్ద పెద్ద హీరోలతోనే పని చేసే దేవిశ్రీతో ఇన్నాళ్లకు పని చేసే అవకాశం లభించిందని.. తనకు గుర్తుండిపోయే ఆల్బమ్ అతడిచ్చాడని నాని అన్నాడు. రెండు రోజుల కిందటే రిలీజైన ‘నేను లోకల్’ పాటలు ఇన్‌స్టంట్‌గా హిట్టయిపోయి సినిమాపై అంచనాల్ని మరింత పెంచేశాయి.