నాని ఏడు కోట్లకి ఎదిగాడు

వరుస హిట్ల మీద హిట్లు ఇస్తోన్న నాని పారితోషికం మరింత పెరిగింది. ‘నేను లోకల్‌’ తర్వాత ‘నిన్ను కోరి’తో మరోసారి పాతిక కోట్ల షేర్‌ని అవలీలగా సాధించిన నాని చిత్రాలకి ఇప్పుడు మార్కెట్‌ గణనీయంగా పెరిగింది. రెండేళ్ల క్రితం అతని సినిమాల స్థాయి పన్నెండు నుంచి పదిహేను కోట్ల వరకు వుంటే ఇప్పుడు పాతిక నుంచి ముప్పయ్‌ కోట్లు చేస్తున్నాయి.

నాని చిత్రాల బడ్జెట్‌ అదే స్థాయిలో పెరగకపోవడం వల్ల నిర్మాతలు లాభాలు చేసుకుంటున్నారు. బయ్యర్లకీ తక్కువకి అమ్మగలుగుతున్నారు. దీంతో వారం తిరగకుండా బయ్యర్లు కూడా లాభాల బాట పడుతున్నారు. సినిమా హిట్‌ అవగానే డిమాండ్‌ పెంచేసి, బడ్జెట్‌ని అధికర చేయకుండా ఎప్పుడూ ఒకే బ్రాకెట్‌లో వుంచడం వల్లే నాని మార్కెట్‌ ఇంతగా పెరిగింది. ఇప్పుడు మధ్య శ్రేణి హీరోల్లో నానికి వున్నంత క్రేజ్‌ మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు.

అటు ప్రేక్షకుల్లో నమ్మకం పెంచుకోవడంతో పాటు ఇటు ట్రేడ్‌ ట్రస్ట్‌ని కూడా పొందాడు కనుకే నానికి ఇప్పుడు ఏడు కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధమైపోతున్నారు. స్టార్‌ హీరోల పారితోషికం పది నుంచి పన్నెండు కోట్ల మధ్య వుంటే, మిడిల్‌ రేంజ్‌ హీరోలకి మూడు నుంచి అయిదు కోట్లే ఇస్తున్నారు. కానీ నాని చూపిస్తోన్న నిలకడకి అతనికి ఏడు కోట్ల పారితోషికం ఇచ్చినా ఓకే అని నిర్మాతలే స్వచ్ఛందంగా అతని పారితోషికం పెంచారు. నాని ఇదే పద్ధతి కొనసాగిస్తూ, ఇలాగే నిలకడగా విజయాలు సాధిస్తూ వుంటే పది కోట్ల స్థాయికి ఎదగడం అంత కష్టమేమీ కాదు.