ఆ విషయంలో బిగ్‌బాస్‌ సక్సెస్‌ అయినట్టే

ఎన్టీఆర్‌ని హోస్ట్‌గా తీసుకోవడానికి స్టార్‌ మా నెట్‌వర్క్‌ భారీ స్థాయిలో వెచ్చించింది. ఆ ఖర్చుకి తగ్గ ప్రతిఫలం అయితే ఆల్రెడీ కనిపిస్తోంది. ఇది వేరే ఒక మామూలు నటుడితో చేసినట్టయితే ఎక్కువ మంది అటెన్షన్‌ రాబట్టేది కాదు. కానీ ఎన్టీఆర్‌ లాంటి పెద్ద స్టార్‌ హోస్ట్‌ చేస్తూ వుండడంతో, ఈ షోపై ఆసక్తి ఏర్పడింది. పైగా ఇంతవరకు తెలుగు టీవీ ప్రేక్షకులకి తెలియని ఫార్మాట్‌ కావడం దీనికి పెద్ద ప్లస్‌గా మారే అవకాశాలున్నాయి.

తెలుగు టీవీ షోల్లో చాలా వరకు ఒకే రీతిన సాగుతుంటాయి. గేమ్‌ షోలు లేదా పర్సనల్‌ ఇంటర్వ్యూల మినహా కొత్తరకం ప్రోగ్రామ్‌లు ఎప్పుడో కానీ కానరావు. ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇచ్చే విషయంలో అయితే బిగ్‌బాస్‌ సక్సెస్‌ అయినట్టే. చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేస్తే, ఆ కార్యక్రమం ఎలా సాగుతుంది, ఏమిటి అనేది అందరికీ బాగా తెలుసు. హోస్ట్‌గా చిరంజీవి కొత్త కానీ, ఆ కార్యక్రమం చూసే వాళ్లకి కొత్త సంగతులు ఏమీ లేకుండా పోయాయి. దాంతో ఊహించినట్టే ఆ షో ఫ్లాప్‌ అయింది.

కానీ బిగ్‌బాస్‌కి వచ్చేసరికి కొత్తదనం ఫ్యాక్టర్‌ పెద్ద అడ్వాంటేజ్‌. ఎంచుకున్న కంటెస్టెంట్స్‌లో పెద్ద స్టార్లు లేరేమో కానీ కాంట్రవర్షియల్‌ ఫిగర్స్‌ అయితే వున్నారు. మొదటి ఎపిసోడ్‌లో చెప్పుకోతగ్గ విశేషాలేమీ లేవు కానీ ఎమోషనల్‌ యాంగిల్‌ టచ్‌ చేసి లేడీస్‌ని ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. ముందు ముందు హౌస్‌ మెంబర్స్‌ మధ్య ముసలం మొదలైతే కార్యక్రమం రక్తి కట్టవచ్చు.