మగధీర టైప్‌ రచ్చ జరిగేదే

ట్రెయిలర్‌ చూసి సినిమా ఏంటో ఊహించేయడమే కాకుండా తమ సినిమాని కాపీ కొట్టేసారంటూ ఈమధ్య కోర్టుకి పోవడం కూడా జరుగుతోంది. రాబ్తా చిత్రాన్ని మగధీర నుంచి కాపీ కొట్టారంటూ గీతా ఆర్ట్స్‌ కేస్‌ ఫైల్‌ చేసిన సంగతి తెలిసిందే. ట్రెయిలర్‌ చూసి కాపీ ఎలా అంటారని సదరు నిర్మాతలు గగ్గోలు పెట్టారు, తమ చిత్రం చూపిస్తామంటూ ఆఫర్‌ కూడా ఇచ్చారు. చివరకు కోర్టులో ఆ కేసు కొట్టేసారనుకోండి.

కొన్ని పోలికలు మినహా మగధీరకి, రాబ్తాకి పొంతన లేదని చూసిన వారు తేల్చేసారు. ఇదిలావుంటే ఇలాంటిదే ఇంచుమించు మరో ప్రచారం ఇటీవల విరివిగా జరిగింది. ‘నిన్ను కోరి’ ట్రెయిలర్‌ చూసి ఇది ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ చిత్రానికి కాపీ అంటూ మీడియా ఊదరగొట్టింది.

దీంతో హమ్‌ దిల్‌ దే తీసిన సంజయ్‌ లీలా భన్సాలీ అలర్ట్‌ అయి ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన కోన వెంకట్‌ని కాంటాక్ట్‌ చేసి విషయం కనుక్కున్నాడట. తమ కథని కాపీ కొట్టారా అంటూ వాకబు చేసాడట. అప్పుడు కోన కథ చెబితే విని బాగుందని మెచ్చుకున్నాడట.

ఆ చిత్రానికీ దీనికీ అసలు సంబంధమే లేదని, ఆ సినిమా కథ ఎక్కడ ముగుస్తుందో నిన్నుకోరి అక్కడ మొదలవుతుందని నాని వివరణ ఇచ్చాడు. మీడియా రచ్చ చూసి భన్సాలీ కూడా నిన్ను కోరి రిలీజ్‌పై స్టే కావాలని కోర్టుకి వెళ్లి వుంటే మరో రాబ్తా రేంజ్‌ డ్రామా జరిగుండేదే!