మరి నాని ఏం చేస్తాడిప్పుడు?

‘స్పైడర్’ సినిమా జూన్ 23 నుంచి వాయిదా పడబోతోందని ముందుగా హింట్ ఇచ్చింది నాని సినిమా ‘నిన్ను కోరి’ నిర్మాతలే. తమ సినిమాను జూన్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రెస్ నోట్ ఇవ్వడం ద్వారా.. ‘స్పైడర్’ అనుకున్న తేదీకి రాబోదని తేల్చేశారు. అదే సమయంలో ‘దువ్వాడ జగన్నాథం’ విషయంలోనూ అయోమయం నెలకొంది.

నాని సినిమా జూన్ 23న వచ్చేస్తే.. మే 19 నుంచి అదే తేదీకి వాయిదా పడ్డ ‘డీజే’ పరిస్థితి ఏంటి అనుకున్నారంతా. కానీ నాని సినిమా రిలీజ్ డేట్ గురించి ప్రకటన వచ్చిన 24 గంటలకే ‘డీజే’ వార్తల్లోకి వచ్చాడు. ఆ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు ఘనంగా ప్రకటించేశాడు నిర్మాత దిల్ రాజు.

ఇప్పుడిక నాని సినిమాను ఏం చేస్తారో చూడాలి. కచ్చితంగా డేట్ మార్చుకోవాల్సిందే. నాని గత రెండేళ్లలో ఎంత ఎదిగినప్పటికీ.. బన్నీ సినిమాతో పోటీ పడే స్థాయికింకా చేరలేదు. మంచి డేట్ దొరికింది కదా అన్న సంబరంలో బెర్తు బుక్ చేయబోతే.. ఆ ఆనందం ఒక్క రోజులో ఆవిరైంది. ఈ డేట్ మిస్సయింది కాబట్టి జులై 7న మీద దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

ఐతే ఆ రోజుకు ఆల్రెడీ బోయపాటి శ్రీను-బెల్లంకొండ శ్రీనివాస్‌ల సినిమాకు డేట్ ఇచ్చేశారు. మరి నాని సినిమాను ఏం చేస్తారో చూడాలి. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో చివరి షెడ్యూల్ ముగింపు దశలో ఉంది. శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన నివేదా థామస్ నటిస్తోంది. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు.