‘నిన్ను కోరి’ మూడేళ్లు ఆలస్యంగా..

నాని కొత్త సినిమా ‘నిన్ను కోరి’ ఇంకో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేయబోతోంది. ఈ చిత్రంతో శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. తన తొలి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నపుడు ఓ యువ దర్శకుడు ఎంత ఎగ్జైట్మెంట్‌తో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏళ్లకు ఏళ్లు కన్న కలలు నెరవేరే సమయమది. జీవితంలో అంతకంటే ఎగ్జైట్మెంట్ మరేదీ ఇవ్వదు.

అందులోనూ ఓ కథతో కొన్నేళ్ల పాటు ట్రావెల్ చేసి.. అనేక ప్రయత్నాల తర్వాత అది తెరమీదికి వచ్చినపుడు ఉద్వేగం మరింతగా ఉంటుంది. ‘నిన్ను కోరి’ ఆ కోవలోని కథే. ఈ కథను నానికి శివ చెప్పి చాలా కాలమే అయింది.

నాని అంతగా ఫామ్‌లో లేని టైంలో.. మూడేళ్ల కిందటే ‘నిన్ను కోరి’ కథను అతడికి చెప్పాడట శివ. ఐతే నాని అప్పుడు స్లంప్‌లో ఉండటంతో సినిమా వెంటనే పట్టాలెక్కలేదు. ఆహా కళ్యాణం, పైసా లాంటి ఫ్లాపులతో నాని కెరీరే ప్రశ్నార్థకంగా మారడంతో ‘నిన్ను కోరి’ని పట్టాలెక్కించే నిర్మాత దొరకలేదు. ఐతే కథ బాగా నచ్చడంతో శివను వేరే హీరోల దగ్గరికి వెళ్లకుండా ఆపాడట నాని.

తర్వాత ‘ఎవడే సుబ్రమణ్యం’ సక్సెస్‌తో కొంచెం ఊపిరి పీల్చుకోవడం.. ఆపై ‘భలే భలే మగాడివోయ్’తో నిలదొక్కుకోవడం.. తర్వాత వరుసగా కమిట్మెంట్లు ఇవ్వడం.. అవన్నీ పూర్తయి.. చివరికి పోయినేడాది డీవీవీ దానయ్య-కోన వెంకట్ సంయుక్త నిర్మాణంలో ‘నిన్ను కోరి’ని పట్టాలెక్కించడం జరిగింది. మొత్తానికి ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి నానికి అంతగా కనెక్టయిన కథ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తుందో చూద్దాం.