సాయిధరమ్‌తేజ్‌కి అంత సీన్‌ ఇవ్వట్లేదా?

సాయిధరమ్‌తేజ్‌ ఇప్పటికే హీరోగా నిలదొక్కుకున్నాడు. తన సినిమా హిట్టయితే పాతిక కోట్లు వసూలు చేయగలనని నిరూపించుకున్నాడు. సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, సుప్రీమ్‌తో మధ్య శ్రేణి హీరోల్లో పాతుకుపోయిన సాయిధరమ్‌తేజ్‌ ఇక నెక్స్‌ట్‌ లెవల్‌కి వెళ్లడం మీద దృష్టి పెట్టాలి. ఇందుకోసం మంచి కథలు ఎంచుకోవడంతో పాటు మంచి సీజన్లలో తన సినిమాలు విడుదలయ్యేలా చూసుకోవాలి.

ఉదాహరణకి సంక్రాంతికో, సమ్మర్‌కో రిలీజ్‌ అయిన సినిమా ఫిబ్రవరిలోనో, నవరబర్‌లోనో రిలీజ్‌ అయితే వచ్చే కలెక్షన్లలో కనీసం ఇరవై, ముప్పయ్‌ శాతం కోత పడుతుంది. అందుకే ఏ సినిమాకి అయినా మంచి సీజన్‌ చూసుకుని రిలీజ్‌ చేస్తుంటారు. ఎక్కువమంది సంక్రాంతి, సమ్మర్‌, దసరాలని ప్రిఫర్‌ చేస్తుంటారు.

కానీ సాయిధరమ్‌తేజ్‌కి ఇంకా ఇలాంటి ప్రైమ్‌ స్లాట్‌లు దొరకడం లేదు. సుప్రీమ్‌ చిత్రానికి సమ్మర్‌లో గ్యాప్‌ దొరకడంతో విడుదల చేసి లాభపడ్డారు. కానీ ‘విన్నర్‌’ని మాత్రం ఫిబ్రవరి మూడవ వారంలో విడుదల చేస్తున్నారు.

ఫిబ్రవరి మూడవ వారం నుంచి మార్చి మూడవ వారం వరకు తెలుగు సినిమాలకి కలిసి వచ్చే టైమ్‌కాదు. పరీక్షల సమయం కావడంతో స్టూడెంట్స్‌, ఫ్యామిలీస్‌ సినిమాలకి దూరంగా వుంటారు. మళ్లీ మార్చి నెలాఖరులోనే సినిమా సందడి మొదలవుతుంది. కానీ మార్చి నెలాఖరు నుంచి ప్రతి రెండు వారాలకీ ఒక పెద్ద సినిమా రిలీజ్‌ అవుతుండడంతో తేజ్‌ సినిమాని బ్యాడ్‌ సీజన్లోనే విడుదల చేసుకుంటున్నారు. ఒక రెండు బ్లాక్‌బస్టర్లు పడితే తప్ప ఈ మెగా హీరోకి ప్రయిమ్‌ స్లాట్‌లోకి ప్రమోషన్‌ వచ్చేట్టు లేదు.