ఆమె బాధ అంతాఇంతా కాదు

కాలం చిత్రమైంది. అవకాశాలు కుప్పలు తెప్పలు వచ్చే రోజులు ఉన్నట్లే.. అవకాశాల కోసం ఎదురు చూసే రోజులు ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఒక ఊపు ఊపేసిన శ్రియకు.. శాతకర్ణికి ముందు సరైన అవకాశాలురాని పరిస్థితి. దీంతో.. ఛాన్స్ ఏది వచ్చినా కాదనకుండా తన ప్రయత్నం తాను చేసేది. శాతకర్ణితో ఆమె సుడి తిరిగిపోయిందని అనుకున్నారంతా.

వశిష్టి పాత్రలో పూర్తిస్థాయిలో ఫిట్ కావటమే కాదు.. శ్రియలో ఇంత మంచి నటి ఉందా? అనిపించేలా చేయగలిగింది. అంతేకాదు.. తనలో గ్లామర్ ఎంతమాత్రం తగ్గలేదన్న విషయాన్ని ప్రతి ఫ్రేంలో చెప్పకనే చెప్పేసింది. శాతకర్ణి సినిమాలో క్రిష్, బాలయ్య  తర్వాత అందరూ మాట్లాడుకుంది శ్రియ గురించి. ఈసినిమాతో అమ్మడికి అవకాశాలే అవకాశాలన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.

ఇలాంటి మాటలు.. అదిరిపోయేలాచేశావన్న ప్రశంసలతో శ్రియ ముఖం వెలిగిపోయింది. ఊహించని రీతిలో వచ్చిపడ్డ క్రేజ్ కి ఉక్కిరిబిక్కిరి అయ్యింది. తనకు అవకాశాలు తన్నుకొస్తాయని ఫీలైందట. కానీ.. అలాంటి పరిస్థితి లేకపోవటం ఆమెను బాధకు గురి చేస్తోందని చెబుతున్నారు. బాలయ్య నెక్ట్స్ మూవీలో ఛాన్స్ ను కన్ఫమ్ చేసుకున్న శ్రియకు.. అది తప్పించి మరేబుకింగ్ ఇప్పటివరకూ జరగలేదట. ఒక సినిమా సూపర్ హిట్ అయి.. హీరోయిన్ కు పేరు వచ్చాక.. అవకాశాల వెల్లువ ఉంటుందని.. శ్రియ విషయంలో మాత్రం అలా జరగలేదన్నది ఇండస్ట్రీ టాక్. ఎందుకిలా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.