బ్రహ్మూత్సవంని మించిన డిజాస్టర్‌

మహేష్‌బాబు, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రహ్మూెత్సవం’ డిజాస్టర్‌ సినిమాలకి బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ఎనభై కోట్లకి మించి బిజినెస్‌ జరిగితే, ముప్పయ్‌ కోట్ల పైచిలుకు వసూళ్లతో బయ్యర్లని నట్టేట ముంచింది.

మళ్లీ అంతటి పరాజయం రావడం కూడా కష్టమే అనుకుంటూ వుంటే, నాగార్జున నటించిన ‘ఓం నమో వెంకటేశాయ’ దానిని మించిన పరాజయంగా నిలిచింది. కనీసం నాలుగోవంతు వసూళ్లు తిరిగి రాబట్టుకోలేకపోయిన ఈ చిత్రం పది కోట్ల మైలురాయిని కూడా చేరుకోలేక పోవడం ఆశ్చర్యం. ఒక్క ఓవర్సీస్‌ బయ్యర్‌కే ఈ చిత్రంపై అయిదు కోట్ల నష్టం వచ్చింది. సినిమా బాగానే వుందంటూ రిపోర్ట్స్‌ వచ్చినప్పటికీ ఈ భక్తిరస చిత్రంపై జనం ఆసక్తి చూపించకపోవడం ట్రేడ్‌ పండితులనే విస్మయ పరచింది.

అసలు ఈ చిత్ర పరాజయానికి అసలు కారణం ఏమిటనేది ఎవరికీ అంతు చిక్కలేదు. అన్నమయ్య చూసేసాం కాబట్టి మళ్లీ అలాంటి కథనే ఎందుకు చూడాలని జనం అనుకోవడం వలనో ఏమో కానీ ఈ చిత్రం దీనికి పని చేసిన అందరికీ చేదు జ్ఞాపకాలని మిగిల్చింది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగార్జునకి ఈ చిత్రం సడన్‌ బ్రేక్‌ వేసింది. ఆయన నటించే తదుపరి చిత్రంపై బయ్యర్ల ఒత్తిడి ఖాయంగా వుంటుందని ట్రేడ్‌ అంటోంది. అసలే అఖిల్‌, నిర్మలా కాన్వెంట్‌ మళ్లీ ఇప్పుడు ఓం నమో వెంకటేశాయతో నాగ్‌ ఫ్యామిలీ నుంచి బయ్యర్లకి వరుస షాక్‌లు తగిలేసాయి.