బాలయ్య ఎంత వసూల్ చెయ్యాలంటే

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘పైసా వసూల్’ థియేటర్లలోకి దిగిపోయింది. టాక్ ఎలా ఉందన్నది ఇంకొన్ని గంటల్లో స్పష్టత వస్తుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే ఆశాజనకంగానే ఉంది. తన వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో బడ్జెట్ పరంగా పెద్ద రిస్కే చేశాడు బాలయ్య. ఆ సినిమా స్కేల్ ప్రకారం ఆ బడ్జెట్ తప్పదు. ఐతే ‘పైసా వసూల్’కు అలా రిస్క్ చేయాల్సిన అవసరం లేకపోయింది.

ఇది మామూలు మసాలా సినిమానే. స్పీడ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేసేశాడు. మొదలైన ఆరు నెలల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. పరిమిత బడ్జెట్లో ఫస్ట్ కాపీ తీసి నిర్మాత చేతిలో పెట్టేశాడు పూరి. మొత్తంగా ఖర్చు రూ.30 కోట్లకు అటు ఇటుగా అయినట్లు సమాచారం.

ముందు ‘పైసా వసూల్’ మీద అంత బజ్ కనిపించలేదు కానీ.. రిలీజ్ దగ్గరపడే కొద్దీ మంచి హైపే వచ్చింది. అందుకు తగ్గట్లే బిజినెస్ కూడా జరిగింది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ను రూ.32.5 కోట్లకు అమ్మినట్లు అంచనా. ‘శాతకర్ణి’తో పోల్చుకోకుండా ఓ మోస్తరు రేట్లకే అమ్మారు సినిమాను. నైజాం హక్కులు రూ.8 కోట్లకు.. ఆంధ్రాలోని అన్ని ఏరియాలు కలిపి రూ.14 కోట్లకు.. రాయలసీమలో రూ.6 కోట్లకు.. ఓవర్సీస్ రూ.1.7 కోట్లకు.. కర్ణాటకలో రూ.2.2 కోట్లకు హక్కులు కట్టబెట్టారు.

అంటే ఈ సినిమా రూ.33 కోట్ల షేర్ రాబడితే హిట్ కేటగిరిలోకి వస్తుందన్నమాట. ఐతే ‘పైసా వసూల్’కు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. రూ.40 కోట్ల మార్కును ఈజీగా దాటేసే అవకాశముంది. యావరేజ్ టాక్‌తో కూడా హిట్ అయిపోవచ్చు. థియేట్రికల్ రైట్స్ కాకుండా శాటిలైట్, డబ్బింగ్, ఇతర హక్కులన్నీ కలిపి ఇంకో రూ.14 కోట్ల దాకా నిర్మాతకు ఆదాయం సమకూరడం విశేషం.

https://www.youtube.com/watch?v=MKODt48PqLA