అర్జున్ రెడ్డి హీరోయిన్.. మామూలు పిల్ల కాదు

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో కనిపించిన నటీనటుల్లో హీరో విజయ్ దేవరకొండ అందరికంటే ఎక్కువ స్కోర్ చేస్తే.. రెండో స్థానాన్ని హీరో ఫ్రెండు పాత్రలో నటించిన రాహుల్ రామకృష్ణ అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానం హీరోయిన్ షాలినిదే. సినిమాలో ఆమె పాత్ర చూస్తే పెద్దగా నటించినట్లు అనిపించదు కానీ.. భావోద్వేగాలు బయటపడనివ్వని పాత్రలో ఆమె అభినయాన్ని తక్కువ చేయడానికి లేదు.

ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాల్లో షాలిని నటన బాగా ఆకట్టుకుంటుంది. ఉత్తరాదికి చెందిన ఈ అమ్మాయి థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చింది. ఆమె గురించి ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సందీప్ రెడ్డి చాలా బాగా చెప్పాడు. ఆమె జబల్ పూర్లో స్టేజ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుందని.. సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ అని.. అందుకోసం ఏమైనా చేస్తుందని అన్నాడు.

‘అర్జున్ రెడ్డి’ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది షాలిని. తనకు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉందని.. ఈ రంగంలోకి రావాలనుకున్నపుడు తన తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడని.. తాను ఐటీ జాబ్ చేయాలన్నది ఆయన కోరిక అని.. ఐతే తన కలకు అడ్డం పడుతున్నారన్న కారణంతో తాను ఇల్లు వదిలి ముంబయికి పారిపోయి వచ్చేశానని.. ‘మీ నుంచి నాకు రూపాయి కూడా అవసరం లేదు.. నా కాళ్ల మీద నేనే నిలబడతా’ అంటూ తన తండ్రికి మెయిల్ చేశానని.. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి చివరికి ‘అర్జున్ రెడ్డి’తో బ్రేక్ అందుకున్నానని షాలిని తెలిపింది.

అర్జున్ రెడ్డి లాగే తాను కూడా నిజ జీవితంలో రెబల్ అని.. తన తండ్రి తన మార్గాన్ని వ్యతిరేకించడం వల్లే తాను తన సొంత కాళ్లపై నిలబడ్డానని, స్వతంత్ర మహిళగా ఎదిగానని.. కాబట్టి ఈ విషయంలో తన తండ్రికి ధన్యవాదాలు చెప్పాలని షాలిని అంది.