‘భీమ్లా నాయక్’ నుంచి బిగ్ అప్ డేట్ రెడీ

టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సంక్రాంతిని భారీ లెవెల్లో సెలబ్రేట్ చేసుకోవాలని ఉత్సాహంగా ఎదురుచూశారు. చాలా ప్లాన్ లు చేసుకున్నారు. కానీ వారి ప్లాన్ లకు షాకిస్తూ సంక్రాంతి బరిలో దిగాల్సిన `ఆర్ ఆర్ ఆర్`.. రాధేశ్యామ్ చిత్రాలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. జనవరి 7న విడుదల కావాల్సిన `ఆర్ ఆర్ ఆర్` 14న ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్సయిన `రాధేశ్యామ్` చివరి నిమిషంలో ఒమిక్రాన్ కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఈ రెండు సినిమాల కారణంగా పవన్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ `భీమ్లా నాయక్` రిలీజ్ వాయిదా పడాల్సి వచ్చింది. పై రెండు చిత్రాల రిలీజ్ లు వాయిదా పడినా పవర్ స్టార్ సినిమా అయినా సంక్రాంతి బరిలో సందడి చేస్తుందని అంతా భావించారు. అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూశారు కానీ ఈ మూవీ కూడా వాయిదా పడాల్సి వచ్చింది. దీంతో సంక్రాంతికి వరుస బిగ్ మూవీస్ హంగామా వుంటుందని ఎదురుచూసిన అభిమానులకు సినీ ప్రియులకు తీవ్ర నిరాశే ఎదురైంది.

ఇన్ని రోజులుగా బిగ్ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు త్వరలోనే బిగ్ అప్ డేట్ రానుందని తెలిసింది. అది `భీమ్లా నాయక్` టీమ్ నుంచే రాబోతోందని చెబుతున్నారు. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ తో పాటు రానా కూడా ఓ హీరోగా నటించారు.

నిత్యమీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు రచనా సహకారం అందించారు.

`భీమ్లా నాయక్` కు త్రివిక్రమ్ హ్యాండ్ వుండటంతో ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా చాలా రోజుల తరువాత పవన్ పవర్ఫుల్ మాస్ పాత్రలో నటించడం తమన్ అందించిన బీజిఎమ్స్ అదిరిపోయి నెట్టింట వైరల్ కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న కానీ ఏప్రిల్ 1న కానీ రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ తాజా అప్ డేట్ ప్రకారం ఈ మూవీని ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట.

ఈ నెల నాలుగవ వారంలోనే అంటే 25నే ఈ మూవీ వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని ఆకారణంగానే మేకర్స్ రిలీజ్ డేట్ ని మార్చలేదని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ డేట్ విషయంలో ఈ మూవీ మేకర్స్ నుంచి ఒక బిగ్ అప్ డేట్ త్వరలోనే రాబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అదే జరిగితే సినీ లవర్స్ తో పాటు పవన్ ఫ్యాన్స్ కి పండగే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.